వినాయక్‌నగర్, అక్టోబర్19: జిల్లాలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. అతివలపై ఆగడాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా మరో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అర్ధరాత్రి వేళ నమ్మి వచ్చిన బాధితురాలిని దారి మళ్లించి దారుణానికి తెగబడ్డారు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఉదంతం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపిం ది. బోధన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ షాపింగ్ కోసమని శుక్రవారం నిజామాబాద్‌కు వచ్చింది. షాపింగ్ ముగించుకుని బస్టాం డ్ చేరే సరికి రాత్రి 11 గంటలు అయింది. ఆ సమయంలో బస్సులు లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ ఆటో వద్దకు వెళ్లి తాను బోధన్ వైపు వెళ్లాలని చెప్పగా, డ్రైవర్ అటే వెళ్తున్నామని చెప్పాడు. అప్పటికే ఆటోలో మగవాళ్లు ఉండడంతో వారు కూడా ప్రయాణికులే అనుకుని ఆ మహిళ ఆటోవాలాను నమ్మింది.
ఆమె ఆటో ఎక్కగానే సదరు ఆటోడ్రైవర్ బోధన్ వైపు కాకుండా డిచ్పల్లి వైపు ఆటోను మళ్లించాడు. ఇది గమనించిన మహిళ ఆటోడ్రైవర్‌ను ప్రశ్నించగా, పక్కన కూర్చున్న వారు అరిస్తే చంపుతామంటూ భయపెట్టారు. అనంతరం డిచ్పల్లి-రాంపూర్ మార్గమధ్యంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి నలుగురు కలిసి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం ఎవరికైనా చెబితే నీ అంతు చూస్తామంటూ ఆమెను నిజామాబాద్ బస్టాండ్ వద్ద దింపేసి వెళ్లిపోయారు. ఎలాగోలా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్న బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్‌హెచ్‌వో రఘుపతి కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మరోవైపు, పోలీసులు కేసును కొలిక్కి తెచ్చినట్లు తెలిసింది. డిచ్పల్లి శివారు ప్రాంతాలకు చెందిన నలుగురు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.