Gang war | వినాయక్ నగర్, ఏప్రిల్, 14 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి సమయంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణ పరస్పరం దాడులకు దారితీసింది. ఈ దాడిలో రెండు గ్రూపులకు చెందిన ఇద్దరు యువకులు ఒకరి పై ఒకరు దాడులు చేసుకోవడంతో ఇరువురు గాయాల పాలయ్యారు.
స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి నగరంలోని అహ్మద్ పుర కాలనీ లోగల హోటల్ చౌరస్తా వద్ద రెండు గ్రూపులకు చెందిన పలువురు యువకులు ఒకే దగ్గర పోగయ్యారు. అదే సమయంలో సాజిత్ ఖాన్, బసీద్ ఖాన్ ఇద్దరు యువకులు చిన్న విషయంలో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. దాన్ని గమనించి అక్కడే ఉన్న రెండు గ్యాంగులకు చెందిన ఇరువురి యువకులు కత్తులు తీయడంతో ఘర్షణ పెరిగి ఒకరి పై ఒకరు దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడిలో సాజిద్ ఖాన్ తో పాటు మరో గ్యాంగ్ కు చెందిన బసీద్ ఖాన్ కు గాయాలయ్యాయి. వారి అనుచరులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దాడుల ఘటనపై సంబంధిత రెండో టౌన్ ఎస్ఐ యాసీర్ ఆరాఫత్ ను వివరణ కోరగా తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి గొడవ జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే వారు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని ఎస్సై పేర్కొన్నారు. కత్తులతో దాడులకు పాల్పడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు వచ్చిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై పేర్కొన్నారు.అయితే ఈ రెండు గ్యాంగులకు మధ్య జరిగిన ఘర్షణకు ప్రధాన కారణం ఏమిటని కోణంలో పోలీసు దర్యాప్తు చేపట్టారు.