నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 15 : అడ్డదారిన డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ముఠాగా ఏర్పడి పదుల సంఖ్యలో చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. సీపీ నాగరాజు గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఠా వివరాలను వెల్లడించారు. నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన కుత లింగం, కుతడి దేవేందర్, నిజామాబాద్‌లోని పాములబస్తీకి చెందిన మల్లపురి యాదగిరి, మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా సంగెం గ్రామానికి చెందిన కొక్కిరి అరుణ్ అనే నలుగురు వ్యక్తులు కలిసి దొంగతనాలకు పాల్పడ్డారని, దొంగిలించిన సొత్తును నిజామాబాద్‌లోని ఆటోనగర్‌కు చెందిన సయ్యద్ వజీద్‌కు విక్రయించేవారని విచారణలో తేలిందని తెలిపారు. నందిపేట్, నవీపేట్, మాక్లూర్, ఇందల్వాయి, రెంజల్, డిచ్పల్లి మండలాలతో పాటు నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, కామారెడ్డి జిల్లాలో 31 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి తీగలను దొంగిలించారని, నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో, అలాగే ఓ వైన్ షాప్‌లో దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ నలుగురితో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన సయ్యద్ వజీద్పై కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
గురువారం మధ్యాహ్నం నందిపేట్‌లోని వివేకానంద చౌరస్తా వద్ద సిబ్బంది తనిఖీలు చేస్తుండగా.. కుత లింగం, కుతడి దేవేందర్ పట్టుపడ్డారని, విచారణ చేపట్టగా చోరీల వివరాలు వెల్లడైన ట్లు తెలిపారు. యాదగిరి, సయ్యద్ వజీద్ పరారీలో ఉన్నారని, కొక్కిరి అరుణ్ వేరే కేసు లో జైలులో ఉన్న ట్లు వెల్లడించారు. కేసు విచారణ చేపట్టిన నందిపేట్ ఎస్సై శ్రీకాంత్, ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్‌ను సీపీ అభినందించారు. సమావేశంలో డీసీపీ అరవింద్ బాబు, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, సీసీఎస్ ఏసీపీ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.