కామారెడ్డి,మే 21 : కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని గోదాముల నుంచి భారీ మొత్తంలో సిగరెట్లు చోరీ చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ సింధూశర్మ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిందితుల కోసం 15రోజుల నుంచి సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని, సాంకేతికత ఆధారంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో నివాసం ఉంటున్న కుమావత్ మందారం, హైదరాబాద్‌లో నివాసముంటున్న కుమావత్ లక్ష్మణ్‌లను పట్టుకోగా, మరో నిందితుడు కుమావత్ ఘన్‌శ్యాం పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరంతా రాజస్థాన్వాసులని వివరించారు. నిందితుల నుంచి రూ.8 లక్షల నగదుతోపాటు బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.7.50 లక్షలు, స్విఫ్ట్‌కారు, మూడు సెల్ఫోన్లు, గడ్డపార, స్క్రూ డ్రైవర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నకిరేకల్, కర్ణాటక రాష్ట్రంలోని హనుమాబాద్, మహబూబ్‌నగర్ రెండోటౌన్, కామారెడ్డి, అమన్‌గల్, వనపర్తి, వనపర్తి రూరల్, కేయూసీ వరంగల్‌లో కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎవరు నేరం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. కేసును చేధించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, సీసీఎస్ ఎస్సైలు ఉస్మాన్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.