వినాయక్‌నగర్, మార్చి 8 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన నలుగురు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
వీరిపై వివిధ పోలీస్స్టేషన్లలో సుమారు 40 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ముఠా సభ్యులను శనివారం నిజామాబాద్ నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాందేవ్‌వాడ ప్రాంతంలో ఉన్న ఓ ట్రాన్స్‌ఫోర్స్ ఆఫీసులో రెండు రోజుల క్రితం అర్ధరాత్రి దుండగులు నగదు దోచుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆటోరిక్షాలో అనుమానాస్పదంగా వచ్చిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ట్రాన్స్‌ఫోర్స్ ఆఫీస్‌లో చోరీ చేసినట్లు అంగీకరించారని వెల్లడించారు.
నిందితులను నాగారం ప్రాంతంలోని దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన పాత నేరస్తుడు షేక్ సాదిక్ (ఇప్పటివరకు 14 చోరీ కేసులు), సురేకర్ ప్రకాశ్ (4 చోరీ కేసులు), 50 క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ షాదుల్లా (15 చోరీ కేసులు), దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన సాయినాథ్ విఠల్ రావు ముక్తే (3 చోరీ కేసులు)గా గుర్తించినట్లు వివరించారు. వీరి నుంచి రూ.10 లక్షల 17 వేల నగదు, ఆటో రిక్షా స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషిచేసిన నగర సీఐ శ్రీనివాస్‌రాజ్, త్రీ టౌన్ ఎస్సై హరిబాబు, సీసీఎస్ సీఐ సురేశ్, సిబ్బంది రవీందర్‌ను పోలీసు అధికారులు అభినందించారు.