నిజామాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి ఇన్చార్జీల పాలనలోనే కొనసాగుతున్నది. తాజాగా యూనివర్సిటీకి మరోసారి సీనియర్ ఐఏఎస్ అధికారి ఇన్చార్జీ వీసీగా నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల బాధ్యతలను ఐఏఎస్‌లకు అప్పగించిన ప్రభుత్వం.. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయ ఇన్చార్జి వీసీగా సందీప్‌కుమార్ సుల్తానియాను నియమించింది. ఆవిర్భావం నుంచి అత్యధిక కాలం ఇన్చార్జీల పాలనలో నడుస్తున్న ఈ వర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయ ప్రక్షాళన పగటి కలగానే మారింది. పూర్తి స్థాయి వీసీ లేకపోవడంతో వర్సిటీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బోధన, బోధనేతర సిబ్బంది వ్యవహరిస్తున్నారు. పూర్తి కాలపు వీసీగా వచ్చిన ప్రొఫెసర్ రవీందర్ గుప్తా తీరుతో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వర్సిటీ పరువు పోయింది. లంచం తీసుకుంటూ పట్టుబడిన రవీందర్ గుప్తాను వీసీ బాధ్యతల నుంచి తొలగించారు. ఆ తర్వాత ఇద్దరు ఐఏఎస్‌లు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేక పోయారు. దీంతో రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొ.యాదగిరి ఒక్కరే అన్ని బాధ్యతలను చూస్తుండటం విమర్శలకు తావిచ్చింది. పైగా బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకోక మీనమేషాలు లెక్కించడం వంటి ఘటనలు టీయూ ప్రతిష్టను దిగజార్చాయి.
2006 జూన్ 18న ఆవిర్భవించిన తెలంగాణ యూనివర్సిటీకి ఆది నుంచి ఇన్‌చార్జీలే దిక్కయ్యారు. వర్సిటీ ఆవిర్భావ సమయంలో తొలి వీసీగా ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖి మూడు నెలల పాటు ఇన్‌చార్జీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రొఫెసర్ సులోచనారెడ్డి నాలుగు నెలలు పని చేశారు. 2006 నవంబర్ 6న పూర్తి స్థాయి వీసీగా నియమితులైన ప్రొ.కాశీరామ్ 2009 నవంబర్ 3 వరకు పని చేశారు. అత్యధిక కాలం వీసీగా ఉన్న ఆయన వర్సిటీని గాడిలో పెట్టారు. ఆ తర్వాత ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి ఏడాది పాటు, ఓయూకు చెందిన ప్రొఫెసర్ తిరుపతిరావు మూడు నెలలు, ప్రొఫెసర్ వి.గోపాల్‌రెడ్డి ఆర్నెళ్లు ఇన్చార్జీ వీసీలుగా పని చేశారు. 2011 జూలై 15న పూర్తి స్థాయి వీసీగా నియమితులైన ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ 2014 జూలై 14 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తర్వాత ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ ఆర్నెళ్లు, ఐఏఎస్ అధికారి పార్థసారథి రెండేండ్లపాటు ఇన్చార్జి వీసీగా వ్యవహరించారు.
2016 జూలై 25న శాశ్వత వీసీగా నియమితులైన ప్రొ.సాంబయ్య 2019 జూలై 24న పదవీ విరమణ చేశారు. తర్వాత ఐఏఎస్ అధికారి వి.అనిల్ కుమార్ ఆర్నెళ్లు, నీతూకుమారి ప్రసాత్ ఏడాదిన్నర పాటు బాధ్యతలు నిర్వర్తించారు. 2021 మే 22న పూర్తి స్థాయి వీసీగా నియమితులైన ప్రొ.రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో ప్రభుత్వం ఆయనను తప్పించింది. 2022 జూలై 13 నుంచి ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ, ఆ తర్వాత బుర్రా వెంకటేశం ఇన్చార్జి వీసీగా కొనసాగారు. తాజాగా మరో సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా ఇన్చార్జి వీసీగా నియమితులయ్యారు. వర్సిటీ ఆవిర్భావం నుంచి 18 ఏళ్లలో 15 మంది వీసీలు పని చేస్తే ఇందులో ఏడుగురు ఇన్‌చార్జీలే కావడం గమనార్హం. వీరి ఆధ్వర్యంలోనూ ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. ఐఏఎస్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో టీయూ పరిస్థితి గందరగోళంగా మారింది.
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే వేరు వారు ఆ తప్పు చేసేందుకు భయపడుతారు. కానీ వర్సిటీలో అలాంటి పరిస్థితి లేనే లేదు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమాలకు పాల్పడే వారిదే ఇక్కడ రాజ్యం అన్నట్లుగా ఉంది. అలాంటి వారికే వీసీలు, రిజిస్ట్రార్లు వంత పాడుతుండటంతో బోధన, బోధనేతర సిబ్బందిలో క్రమశిక్షణ లోపించింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొంత మంది ఆచార్యులైతే క్లాస్ రూముల్లో నీతులు బోధిస్తూనే… నిజ వ్యవహారాల్లో మాత్రం తప్పటడుగులు వేస్తూ నవ్వుల పాలవుతున్నారు. కొంత మంది ఆచార్యులు నెలల తరబడి వర్సిటీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్న వైనం విస్మయం కలిగిస్తున్నది. వీరికి జీతాల బిల్లులను మంజూరు చేస్తూ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న సిబ్బంది కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అక్రమ నియామకాలు, కాంట్రాక్టు పనుల్లో ఇష్టారాజ్యం, నిబంధనలకు విరుద్ధంగా పనుల అప్పగింత, పరీక్షల విభాగంలో నిర్లిప్తత, పరిపాలనలో అలసత్వం వెరసి వర్సిటీని భ్రష్టు పట్టించాయి. ఇలాంటి దుస్థితిలో ఇన్చార్జి వీసీగా నియమితులైన సందీప్‌కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలోనైనా టీయూ గాడిలో పడాలని విద్యార్థులు ఆశిస్తున్నారు.