‘మిషన్ కాకతీయ’ తెచ్చిన సత్ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో తటాకాలు అలుగులు పోస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల హయాంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను మాజీ సీఎం కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా పునరుద్ధరించారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో అనేక తటాకాలు మళ్లీ వినియోగంలోకి వచ్చాయి. ఆయకట్టు కింది పొలాలకు ఆయువుపట్టుగా మారాయి. వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలకు నీళ్లందిస్తున్నాయి. భూగర్భ జలాలు పెరగడంతో రైతులు ఆనందంగా పంటలు సాగు
చేస్తున్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూర్ గ్రామశివారులో ఉన్న పల్ చెరువు, దాల్ చెరువు నిండుకుండల్లా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవతో మిషన్ కాకతీయ పథకంలో భాగం గా రూ.85 లక్షలతో చెరువుల్లో పూడిక తీసి కట్ట ఎత్తు పెంచారు. కొత్తగా తూములు ఏర్పాటు చేసి పంట కాలువలకు సీసీ లైనింగ్ వంటి పనులు చేపట్టారు. ఫలితంగా రెండు చెరువుల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండే అవకాశం ఏర్పడింది. రూ.4.50కోట్లతో స్థానిక వాగుపై చెక్‌డ్యామ్ నిర్మించగా ప్రస్తుతం జలకళను సంతరించుకొని మత్తడి దూకుతున్నది.
మోర్తాడ్/సారంగాపూర్, ఆగస్టు 29 : ఉమ్మడి జిల్లాలోని అనేక చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఇటీవలి వర్షాలకు నిండుకుండల్లా మారిన తటాకాలు అలుగు పోస్తున్నాయి. ఆయకట్టు కింద రెండు పంటల సాగుకు అభయమిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చిన్నవి, పెద్దవి కలిపి 2500 చెరువులున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి లక్షలాది ఎకరాలకు నీరందుతున్నది. వర్షాకాలం ఆరంభంలో చెరువులున్నీ బోసిపోగా, ఇటీవలి వర్షాలకు నిండుగా మారాయి. మత్తళ్లు పోస్తున్న చెరువులను చూసి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘కాకతీయ’తో పునరుద్ధరణ..
తెలంగాణలో కాకతీయులు తవ్వించిన గొలుసుకట్టు చెరువులే వ్యవసాయానికి ప్రధాన ఆధారం. అయితే, సమైక్య రాష్ట్రంలో తటాకాలు ఆనవాళ్లు కోల్పోయాయి. వందలాది చెరువులు కనుమరుగు కాగా, రైతులు బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెరువులుంటేనే భూగర్భ జలాలు పెరిగి, బోర్లలో నీళ్లు వచ్చే పరిస్థితి. కాలం కాకపోతే కరువు తాండవిస్తుండేది. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి సీఎం కేసీఆర్.. చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించారు. పూడిక, చెట్లతో నిండిపోయిన తటాకాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు మిషన్ కాకతీయ పథకం తీసుకొచ్చారు. 2015 మార్చి 12న సదాశివనగర్లోనే కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలోని వేలాది చెరువుల్లో పూడిక తొలగించారు. ఫలితంగా పల్లెల్లో మళ్లీ జల పరవళ్లు ఆవిష్కృతమయ్యాయి. బీడువారిన పొలాల్లో పచ్చని పంటలు దర్శనమిస్తున్నాయి.
రెండు పంటలకు భరోసా..
ఇటీవలి వర్షాలతో చెరువులు కొత్త నీటితో కళకళలాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సీఈ పరిధిలో బోధన్‌లో 182, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 324, ఆర్మూర్‌లో 198, బాల్కొండలో 292 చెరువులు కలిపి ఇరిగేషన్ శాఖ మొత్తం 996 చెరువులున్నాయి. అలాగే, కామారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ సీఈ పరిధిలో బాన్సువాడ డివిజన్ పరిధిలో 185, నిజాంసాగర్ డివిజన్ పరిధిలో 400, కామారెడ్డి డివిజన్లో 370, ఎల్లారెడ్డి డివిజన్లో 560 కలిపి మొత్తం 1515చెరువులున్నాయి. వీటిలో చాలావరకు జలకళ సంతరించుకున్నాయి.
అలుగు పోస్తున్న ‘పెద్ద చెరువులు’
అతిపెద్దవిగా పేరొందిన చెరువులు సైతం మత్తడి దూకుతున్నాయి. కమ్మర్పల్లి మండలంలోనే అతిపెద్ద చెరువైన బషీరాబాద్ కాడి చెరువు అలుగు పారుతున్నది. మోర్తాడ్ మండలంలో అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన ముసలమ్మ చెరువు సైతం మత్తడి దూకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, చెక్‌డ్యాములు జలకళను సంతరించుకోవడంతో ఆయకట్టు పంటలకు ఢోకా లేదని పేర్కొంటున్నారు.