మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. భారీ వర్షాలతో తటాకాలు నిండుకుండల్లా ఉండడంతో మత్స్య సంపదను భారీగా పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ చేయూతనిస్తున్నది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి గాను ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి జిల్ల్లాల్లో చేప పిల్లల పంపిణీ ప్రారంభమైంది. 2023-24 సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాలోని 1018 చెరువుల్లో 4కోట్ల 72లక్షల చేప పిల్లలను వదిలేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో 697 చెరువుల్లో 2కోట్ల 78లక్షల 60వేల చేప పిల్లలను వదిలేందుకు నిర్ణయించారు. ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆనందంగా జీవిస్తున్నాయి. మరోవైపు రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
నిజామాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలతో తటాకాల్లో జల సంపద సమృద్ధిగా ఉండడంతో మత్స్య సంపదను భారీగా పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. కొన్నేండ్లుగా తెలంగాణ సర్కారు చేస్తున్న ఈ ప్రయత్నంలో గ్రామాల్లో మత్స్య సంపద భారీగా పెరుగుతున్నది. దీంతో పాటు మత్స్యకారుల కుటుంబాలకు సైతం వెన్నుదన్ను లభిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండానే ప్రభుత్వమే పూర్తి రాయితీతో చేప పిల్లలను విడుదల చేస్తుండడంతో ఆ వర్గమంతా ఆనందం వ్యక్తం చేస్తు న్నది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి గాను ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రారంభమైంది. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించగా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు జోరుగా చేప పిల్లలను జలాశయా ల్లో వదులుతున్నారు. నిర్ణీత పరిమాణంలో గల చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. నాణ్యతకు పెద్ద పీట వేయడంతో పాటు ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలోనే ఈ ప్రక్రియను చేపడుతున్నారు.
సర్కారు వెన్నుదన్నుగా…
మత్స్యకారులు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే చేపలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా చెరువులు, కుంటలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో చేప పిల్లల పెంపకానికి మత్య్సకారులను ప్రోత్సహిస్తున్నారు. 100 శాతం రాయితీతో చేప విత్తనాన్ని అందించడం ద్వారా వారికి కొండంత భరోసాతో పాటు వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా కేసీఆర్ నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో వీరిని పట్టించుకున్నవారే కరువు. కనీసం రాయితీతో చేప పిల్లలను అందించకపోవడంతో పాటు చెరువులపై అజమాయిషీ చేసేందుకు సైతం మత్స్యకారులను అవకాశం లేకపోయేది. 2023 వానాకాలం ప్రారంభం నుంచి దంచి కొట్టిన వానలతో చెరువులన్నీ నీటి నిల్వతో తొణికిసలాడుతుండడంతో చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం మరోమారు నిశ్చయించింది. ప్రభుత్వమే ఉచితంగా చేప విత్తనాన్ని నేరుగా చెరువుల్లో వదులుతుండడంతో వచ్చే ఆదాయాన్ని ఆయా గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలకే దక్కుతోంది.
ఉమ్మడి జిల్లాలో ఏడున్నర కోట్ల చేప పిల్లలు లక్ష్యం…
గతేడాది 2022-23లో నిజామాబాద్ జిల్లాలో 1043 జలాశయాల్లో 4కోట్ల 85 లక్షల చేప పిల్లలు వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకుని విజయవంతంగా ప్రక్రియను పూర్తి చేశారు. 2023-24 సంవత్సరంలో 1018 చెరువుల్లో 4కోట్ల 72లక్షల చేప పిల్లలను వదిలేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. మరోవైపు రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని 24చెరువుల్లో ఈసారి 90.25లక్షల రొయ్యలను వదిలేందుకు ఏర్పా ట్లు చేశారు. ఇక కామారెడ్డి జిల్లాలో గతేడాది 627 చెరువుల్లో 2కోట్ల 70లక్షల చేప పిల్లలను వదిలారు. 2023-24 సంవత్సరానికి కామారెడ్డి జిల్లాలో 697 చెరువుల్లో 2కోట్ల 78లక్షల 60వేల చేప పిల్లలను వదిలేందుకు నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే కామారెడ్డి జిల్లాలో చెరువుల సంఖ్యను పెంచారు.
ఏటా చేప పిల్లలను వదిలే ప్రక్రియలో విత్తనం సరఫరా చేసే కాం ట్రాక్టర్లతో మత్స్య శాఖ అధికారులు కుమ్మక్కు అవుతుండడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. జలాశయాల్లో హడావుడిగా చేప పిల్లలను వదలడం ద్వారా లెక్కాపత్రానికి జవాబు లభించడం లేదు. దీంతో కొంత మంది అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. చేప పిల్లల సైజులను తప్పనిసరిగా నిబంధనలు పాటించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. చెరువుల్లో చేప పిల్లలను వదిలే సమయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీ బాధ్యుల సమక్షంలో సైజులు, చేప పిల్లల నాణ్యతను నిర్ధారించిన తర్వాత మాత్రమే చెరువుల్లోకి వదిలి పెట్టేలా మత్స్య శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ప్రక్రియ అంతా మత్స్యకారుల సమక్షంలోనే జరుగుతోంది.
చేప పిల్లల విడుదల ప్రారంభమైంది
ఇప్పటికే గుర్తించిన చెరువుల్లో చేప పిల్లలను వదిలే ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా జలాశయాల్లో లక్ష్యానికి అనుగుణంగా చేప పిల్లలను సరఫరా చేసి స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యకారుల సమక్షంలో కార్యక్రమాన్ని చేపడుతున్నాము. కామారెడ్డి జిల్లాలో ఈసారి 60 చెరువులు అదనంగా చేర్చాము. 697 చెరువుల్లో 2కోట్ల 78లక్షల చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేశాము. ఇందులో నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. చెరువుల్లో నీటి నిల్వ ఆశించిన మేర ఉండటంతో చేపల పెంపకానికి అనువైన వాతావరణం ఏర్పడింది.
– వరదా రెడ్డి, మత్స్య శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా