NEET UG 2026 | నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21)న ప్రారంభమైంది.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది.
కాగా నిజామాబాద్ జిల్లాలో నీట్ పరీక్ష 8 కేంద్రాల్లో ప్రశాంతంగా మొదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమ నిబంధనలను అనుసరించి పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేశారు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీ వద్ద నలుగురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు. మరొకరు బోధన్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉండగా.. నిజామాబాద్‌కు వచ్చి పరీక్షకు హాజరు కాలేకపోయారు. యువతులకు చెవికి కమ్మలు, మెడలో గొలుసు, చేతికి గాజులు లాంటివేవి అనుమతించలేదు.
గతంలో 3 గంటలు.. అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పరీక్ష జరిగేది. కానీ, ఈసారి అభ్యర్థుల సౌకర్యార్థం 15 నిమిషాలు అదనంగా సమయం కేటాయించారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. గత నెల 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో రద్దైన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష జరిపే నిర్వహణా సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) దీన్ని రద్దు చేసింది. తిరిగి ఇవాళ మరోసారి పరీక్ష నిర్వహిస్తోంది.



