వినాయక నగర్, జూన్ 14: మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతం శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. కాల్పోల్ అటవీప్రాంతానికి వచ్చిన అటవీ శాఖాధికారులు, సిబ్బందిపై తండావాసులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వోతోపాటు నలుగురికి గాయాలు కాగా..దాడికి పాల్పడినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..నిజామాబాద్ అటవీ శాఖ సౌత్ రేంజ్ ఆఫీసర్ రాధిక.. తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం కాల్పోల్ తండా పరిధిలో ప్లాంటేషన్ ఏరియా పరిశీలన కోసం వెళ్లారు. అయితే ప్లాంటేషన్ ఏరియాలో కొందరు చెట్లను నరికివేసి ట్రాక్టర్‌తో చదునుచేస్తుండడం వీరు గుర్తించారు. అటవీఅధికారుల రాకను గమనించిన కొందరు తండవాసులు కర్రలు, మట్టి పెల్లలతో వీరిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో ఎఫ్ఆర్వో రాధిక, సెక్షన్ ఆఫీసర్ సాయికృష్ణతోపాటు మరో ముగ్గురు బీట్ ఆఫీసర్లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేశ్ కుమార్ సిబ్బందితో కలిసి కాల్పోల్ తండాకు చేరుకొని విచారణ చేపట్టారు. తమపై దాడిచేసిన వారిలో సుమారు 30 మంది వరకు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దాడికి పాల్పడిన వారిపై మోపాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితుల పేర్లను వెల్లడిస్తామని సీఐ తెలిపారు.
ఇందల్వాయి, జూన్ 14 : కాల్పోల్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బందిపై తండావాసుల దాడి హేయమైన చర్య అని బాసర యూనిట్ రేంజ్ అధికారుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ భట్ అన్నారు. దాడికి పాల్పడిన నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందల్వాయి రేంజ్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాల్పోల్ బీట్‌లో మూడేండ్ల క్రితం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను ధ్వంసం చేశారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని ఫారెస్ట్ అధికారులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఎక్కడైనా అటవీ ప్రాంతాన్ని అక్రమంగా చదును చేస్తే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.