ఎల్లారెడ్డి రూరల్, మార్చి 30: కామారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొన్నది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యుఒడిలోకి వెళ్లారు. చెరువులో నీట మునుగుతున్న పిల్లలను రక్షించడానికి వెళ్లిన తల్లి సైతం నీట మునిగి మృతిచెందింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ హృదయవిదారకర ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం భిక్నూర్ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ అగ్రహారంలో చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకా రం.. వెంకటాపూర్ అగ్రహారానికి చెందిన బొమ్మర్థి లింగయ్య (ఏసు)ఎల్లారెడ్డి పట్టణంలో హమాలీగా పనిచేస్తున్నాడు. అతడి భార్య మౌనిక(25) శనివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని పొలంలో నీళ్లు పారించి, అక్కడి నుంచి పెద్దచెరువు బ్యాక్ వాటర్‌లో బట్టలు ఉతుక్కొని వస్తానని ఇంటి నుంచి బయల్దేరింది.
ఇంట్లో ఉన్న సవతి పిల్లలు మైథిలి (10), అక్షర (9), వినయ్ (7) తాము కూడా వస్తామని అడగడంతో వారిని కూడా వెంట తీసుకెళ్లింది. మౌనిక బట్టలు ఉతుకుతుండగా, ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. చెరువులో తీసిన పూడిక మట్టివల్ల లోతుగా గుంతలు ఉండడంతో పిల్లలు అందులో పడిపోయారు. గట్టిగా కేకలు వేయడంతో వారిని రక్షించడానికి నీటిలోకి దిగిన మౌనిక సైతం వారితోపాటు నీటిలో మునిగిపోయింది.
అర్ధరాత్రి మృతదేహాలు లభ్యం
ఎల్లారెడ్డిలో పని ముగించుకొని లింగయ్య సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. భార్యా పిల్లలు కనబడకపోవడంతో లింగయ్య, తన తండ్రి చిన్న లక్ష్మయ్యతో కలిసి వారి కోసం గాలించారు. వారి పొలం వద్ద గాలించి, చివరికి చెరువు బ్యాక్ వాటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నలుగురికి సంబంధించిన బట్టలు, చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా..అర్ధరాత్రి సమయంలో మౌనిక, మైథిలి, వినయ్ మృతదేహాలు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం అక్షర మృతదేహం లభ్యమైంది.
చెరువులో పూడికతీత గుంతలవల్లే లోతు తెలియక పిల్లలు నీట మునగడంతో వారిని రక్షించడానికి తల్లి కూడా వెళ్లి మృత్యువాతకు గురై ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ దవాఖానకు ఆదివారం ఉదయం తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బొజ్జ మహేశ్ తెలిపా రు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం అందరినీ కలిచివేయగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
లింగయ్యకు మూడో పెండ్లి, మౌనికకు రెండో వివాహం
బొమ్మర్థి లింగయ్యకు ఏడాది క్రితం లింగంపేట్ మండలం శట్పల్లి గ్రామానికి చెందిన మౌనిక (25)తో వివాహమైంది. లింగయ్య మొదటి భార్య శ్యామల చనిపోగా, రెండో భా ర్య విభేదాలతో దూరమైంది. మొదటి భార్యతో మైథిలి, అక్షర, వినయ్ సంతానం కలిగింది. మౌనికను మూడో వివాహం చేసుకోగా, ఇదివరకే వివాహమై కూతురు ఉన్న మౌనికకు ఇది రెండో వివాహం. కొన్ని రోజుల క్రితం ఆమె కూతురు సైతం అనారోగ్య కారణాలతో మృతి చెందింది.
పండుగ సెలవుల్లో ఇంటికి..
చెరువులో మునిగి మృత్యువాతకు గురైన ముగ్గురు పిల్లల తల్లి శ్యామల అనారోగ్యంతో 2021లో మృతి చెందింది. అప్పటి నుంచి ముగ్గురు పిల్లలు కలిసి మెలిసి ఉంటున్నారు. ఇద్దరు అక్కలకు తమ్ముడు అంటే ఎనలేని ప్రేమ. తమ్ముడిని కంటిరెప్పలా వారు చూసుకునేవారని కుటుంబీకులు తెలిపారు. మైథిలి ఆరో తరగతి, అక్షర ఐదో తరగతి, వినయ్ మూడో తరగతి చదువుతున్నారు. మైథిలి, అక్షర మెదక్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో హాస్టల్ ఉండి చదువుతున్నారు.
ఉగాది, రంజాన్ పండుగలను పుస్కరించుకొని వరుసగా సెలవులు రావడంతో పిల్లలు గ్రామానికి వచ్చారు. ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్యతో పాటు ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో లింగయ్య దుఃఖసాగరంలో మునిగాడు.