డోంగ్లీ, సెప్టెంబర్ 24: ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు. డోంగ్లీ మండలం లింబూ ర్ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం రూ. 3 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లింబుర్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా రూ. 3 కోట్లతో వాడి బీటీ రోడ్డు, రూ.3.60 కోట్లతో మాదన్హిప్పర్గా హైలెవల్ వంతెన, ఇలేగావ్లో రూ. కోటీ 80 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శశాంక్ పటేల్, మద్నూర్ మండల ఆధ్యక్షుడు బన్సీ పటేల్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దిగంబర్‌రావు పటేల్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మధుకర్ పటేల్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దీన్‌దయాళ్ పాటిల్, విండో మాజీ చైర్మన్ అశోక్ పటేల్, మాదన్ హిప్పర్గా సర్పంచ్ రాజు పటేల్, యూత్ అధ్యక్షుడు సుధాకర్ పటేల్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.