మోర్తాడ్, ఏప్రిల్ 15: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, అందుకే బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీమంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనపై విసుగుచెందిన ప్రజలు సీఎంగా మళ్లీ కేసీఆర్ కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మె ల్యే నివాసంలో మెండోరా మండలం సోన్‌పేట్, దూదిగాం గ్రామ మాజీ సర్పంచులు గోలిప్రకాశ్, పసుల శ్రీనివాస్‌తోపాటు వారి అనుచరులు మంగళవారం వేముల సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు.
వారికి వేముల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా వేముల మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోతె, బుస్సాపూర్ లాంటి గ్రామాలు ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచాయని గుర్తు చేశారు. తన తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డి, కేసీఆర్ వెంట ఉద్యమ ప్రస్థానంలో మొదటి నుంచి నడిచారని తెలిపారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్ల పాలనలో అనేక రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి తిరోగమనంగా సాగుతున్నదని పేర్కొన్నారు. తిరిగి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పటిష్టతకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ మెండోరా మండల అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కమలాకర్, మాజీ ఎంపీటీసీలు దేవేందర్, బాబా, మాజీ సర్పంచులు నాగుల నర్సయ్య, గంగారెడ్డి, రాజారెడ్డి, యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్‌పల్లిలో వాల్‌రైటింగ్‌ను ప్రారంభించిన వేముల
వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి వేముల పిలుపునిచ్చారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో వాల్‌రైటింగ్‌ను ప్రారంభించారు.