ప్రజాపాలన పేరు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. పోలీసు పాలనకు తెర లేపింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఉక్కుపాదంతో అణచివేస్తున్నది. ఎక్కడికక్కడ నిర్బంధ కాండ కొనసాగిస్తున్నది. ఇప్పటికే అనేక నిరసనలను ఖాకీలతో కట్టడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మాజీ సర్పంచులు చేపట్టాలనుకున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని అక్రమ అరెస్టులతో కట్టడి చేసింది.
పెండింగ్ బిల్లుల కోసం శాంతియుత నిరసన చేపట్టాలనుకున్న వారిని సోమవారం తెలవారక ముందే దిగ్బంధించింది. బహిర్భూమికి వెళ్లనీయకుండా, మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే అడ్డు తగిలి మరీ అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్కు చెందిన వారిని మాత్రమే అరెస్టు చేయడం గమనార్హం.చాలా మందిని పోలీస్ స్టేషన్లకు తరలించగా, మరికొంత మందిని గృహ నిర్భంధంలో ఉంచారు.
-నిజామాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గతంలో గ్రామ పంచాయతీల్లో సొంతంగా నిధులు వెచ్చించి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని మాజీ సర్పంచులు కోరుతున్నా రేవంత్ సర్కా రు పట్టించుకోలేదు. నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా సోమవారం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. భయాందోళనకు గురైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాయుతంగా చేపట్టాలనుకున్న కార్యక్రమాన్ని ఖాకీలతో అణచివేసింది.
డీజీపీ ఆదేశాలతో పోలీసులంతా ఎక్కడికక్కడ మాజీ సర్పంచ్‌లను తెలవారుజామున 4 గంటల నుంచే అదుపులోకి తీసుకున్నారు. చివరకు నిద్రలో ఉన్న వారిని లేపి మరీ ఠాణాలకు తరలించారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన వారిని, పొలానికి వెళ్లిన వారిని లుంగీలు, నైట్‌ప్యాంట్లు మీద ఉన్నారని కూడా చూడకుండా అక్రమంగా నిర్బంధించారు. సొంత డబ్బులు పెట్టి పనులు చేయించి బిల్లులు అడిగితే, పోలీసులను ఉసిగొల్పడంపై మాజీ సర్పంచులు మండిపడ్డారు.
ప్రజాపాలన అని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సర్పంచుల కుటుంబాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రజల ఓట్లతో గెలిచి సర్పంచుగా ఐదేళ్లు పని చేసిన వ్యక్తులకు సర్కారు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నాయి. రౌడీ మూకలను, సంఘ విద్రోహులను ఎత్తుకెళ్లినట్లు తమ వారిని ఎత్తుకెళ్లడంపై మాజీ ప్రజాప్రతినిధుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇదేనా ప్రజాపాలన.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నిరసన తెలిపే హక్కు ఉందని, ఆ హక్కును కాంగ్రెస్ సర్కారు కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో గుణపాఠం ఖాయమని హెచ్చరిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి చేసిన పనులకు బిల్లులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి బడా కాంట్రాక్టర్లకు మాత్రం క్షణాల్లో రూ.వేల కోట్లు చెల్లింపులు చేస్తున్నదని, సామాన్యులపై మాత్రం కాంగ్రెస్ సర్కారు ప్రతాపం చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సర్పంచు ఒకరు సోమవారం పొద్దున్నే వాకింగ్‌కు వెళ్లగా, పోలీసులు వచ్చి జీపులో వేసుకెళ్లారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ‘చలో హైదరాబాద్’కు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. అరె నేను హైదరాబాద్ కాదు.. వాకింగ్‌కు వెళ్తున్నా అని చెప్పినా వినకుండా ఠాణాకు తీసుకెళ్లి మధ్యాహ్నం దాకా కూర్చోబెట్టారు.
మరో మాజీ సర్పంచు తెలవారుతుండగా టార్చ్‌లైట్ పట్టుకుని పొలానికి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన పోలీసులు.. లుంగీ మీద ఉన్న అతడ్ని నిర్బంధించి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఏదో నేరం చేసినట్లు పొద్దుగాళ్లనే వచ్చి లుంగీ మీద ఉన్న నన్ను గిట్ల ఎత్తుకొచ్చుడేంది సారు అని ప్రశ్నించినా పట్టించుకోకుండా ఠాణాలో ఉంచారు.
మరో గ్రామంలో ఓ మాజీ సర్పంచు నిద్ర కూడా లేవలేదు. అతడ్ని బలవంతంగా నిద్రలోంచి లేపి మరీ పోలీసు జీపులో తీసుకెళ్లారు. దీంతో ఆయన ఏదో నేరం చేసినట్లు గ్రామంలో ప్రచారం జరిగింది. మధ్యాహ్నం తర్వాత అక్రమంగా నిర్బంధించారన్న నిజం అని తెలిసి గ్రామస్తులు పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోర్తాడ్, నవంబర్ 4: అప్పులు తెచ్చి గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అడిగితే అరెస్టు చేయిస్తారా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాపాలన పేరుమీద ఢాంబికాలకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లవారు జాము నుంచే మాజీ సర్పంచులను, మాజీ ఉపసర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, లేకపోత బీఆర్ఎస్ తరఫున పోరుబాట చేపడతామని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డికి మాజీ సర్పంచులంటే ఎందుకంత కోపమని ప్రశ్నించారు. పొంగులేటి, కోమటిరెడ్డి వంటి బడా కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డబ్బులుంటాయి కానీ, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచులు ఇచ్చేందుకు మాత్రం డబ్బులుండవా? అని నిలదీశారు. ‘రూ.లక్షన్నర బిల్లు కోసం పది నెలల నుంచి తిరుగుతున్నా రావడం లేదని ఓ సర్పంచ్ నాతో మొర పెట్టుకున్నాడు. లక్షన్నర బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులేదు కానీ, లక్షన్నర కోట్లతో మూసి ప్రాజెక్ట్ పనులు చేస్తరట?’ అని వేముల ఎద్దేవా చేశారు. తక్షణమే బిల్లులు చెల్లించాలని, లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఆర్మూర్ టౌన్, నవంబర్ 4: అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్టు చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. చలో హైదరాబాద్‌కు వెళ్లకుండా మాజీ సర్పంచులను తెలవారక ముందే నిర్బంధించడాన్ని ఆయన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. చేసిన పనులకు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇలా అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు జరిగాయని, కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు సరిసమానంగా విడుదల చేశామన్నారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.