ఖలీల్‌వాడి, ఏప్రిల్ 26 : కుంభమేళాను తలపించేలా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నట్లు అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. పార్టీ రజతోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం సంబురాలు నిర్వహించారు. అనంతరం బిగాల విలేకరులతో మాట్లాడుతూ.. దేశం మొత్తం రజతోత్సవ వేడుకను చూసేందుకు తహతహలాడుతున్నదని తెలిపారు.
రజతోత్సవ వేడుకకు ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్నారని తెలిపారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి, ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతి డివిజన్లో ఉదయం 10 గంటలకు జెండాను ఆవిష్కరించి, వరంగల్ సభకు బయల్దేరనున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో యువకుల చేరిక
జిల్లా కేంద్రంలోని 35వ డివిజన్‌కు సంబంధించిన నరేశ్ ఆధ్వర్యంలో వంద మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు గులాబీ టీ షర్టులు ధరించి హంగామా చేశారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా కూడా స్టెప్పులు వేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతూకిరణ్, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, రవిచందర్, సత్యప్రకాశ్, దండు శేఖర్, ఎనుగందుల మురళి, దారం సాయిలు, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, మతీన్ పాల్గొన్నారు.