ఖలీల్‌వాడి నవంబర్ 26 : దశాబ్దాల తెలంగాణ కల కేసీఆర్ దీక్షతోనే సాధ్యమైందని మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా మంగళవారం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. 29న జరిగే దీక్షా దివస్‌కి పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే కనబడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని పల్లెపల్లెనా విస్తరించేందుకు ముందుంటామన్నారు. ఏ నాయకుడు అధైర్యపడొద్దని, ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే వాలిపోతామని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
పదకొండు నెలల పాలనతో కాంగ్రెస్‌లో ఏమీ లేదని అర్థమైందని, అందుకే అందరూ బీఆర్ఎస్ బాట పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకులు మళ్లీ గులాబీ గూటికి రావాలని చూస్తున్నారన్నారు. అలాంటి వారిని బీఆర్ఎస్లోకి రానివ్వబోమని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలుకు పంపుతామని తెలిపారు.
నాయకులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు, తప్పులను ఎత్తిచూపాలన్నారు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఎస్కే అలీమ్, రాంకిషన్, సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, రవిచంద్ర, గంగారెడ్డి, బాజిరెడ్డి జగన్, రాజారాం యాదవ్, ఇమ్రాన్, సుమనారెడ్డి, విశాలినిరెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని హుస్సేన్ అన్నారు. ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు తిరగబడుతుండ్రు. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు మర్లబడుతుండ్రు. మూసీ పరీవాహక ప్రాంత నివాసితులు కాంగ్రెస్ పాలనపై శాపనార్థాలు పెడుతుండ్రు అని తెలిపారు. రైతుబంధు రాలేదు. రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలని మాయ చేసిందని మండిపడ్డారు. జనం ఇప్పుడు మళ్లీ మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటివరకు చేసిందేమీ లేదు. కేసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన రోడ్లు, భవనాలు తప్ప కాంగ్రెస్ చేసింది ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంలా మారింది. ఇప్పటివరకు రైతులకు రైతుబంధు ఇవ్వలేదు. కల్యాణలక్ష్మి లేదు. పెన్షన్ పెంచలేదు. ఏడాది పాలనలో ఏం చేశారంటే సమాధానం లేదు. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అన్ని గ్రామల్లో బీఆర్ఎస్ సత్తా చూపించేందుకు సమయం వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతలను జీరో చేసే విధంగా పని చేయాలి. వచ్చే రోజులు మనవే.
– బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్
ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షాదివస్‌కు బీఆర్ఎస్ సైన్యం తరలిరావాలి. ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి. ఉద్యమంలో ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులు ఎన్నో చేశాం. కానీ కేసీఆర్ చేసిన పనులను చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది బీఆర్ఎస్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ ఒక చిన్న కార్యక్రమం తలపెడితేనే ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈనెల 29న దీక్షదివస్కు వేలాదిగా తరలివస్తారు.
– బిగాల గణేశ్‌గుప్తా, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన కేసీఆర్ ‘దీక్షా దివస్’ చారిత్రక ఘట్టం. ప్రజల చేతిలో తిరుగు లేని బ్రహ్మాస్త్రం. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్. నాడు తెలంగాణ ద్రోహులను తరిమికొట్టింది ఈ బ్రహ్మాస్త్రమే. నేడు మళ్లీ చిట్టినాయుడి ముసుగులో ఉన్న ద్రోహులను తరిమికొట్టేది ఈ బ్రహ్మాస్తమే. ఆరు దశాబ్ధాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను భుజానికెత్తుకుని ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగురవేసిన కేసీఆర్ స్వరాష్ట్ర సాధనకు కర్మ, కర్త, క్రియ. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. దశాబ్దాల కలను నెరవేర్చింది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు చితికిపోయింది. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ పాలనలో అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవే నిర్బంధాలు, అణచివేతలు, దుర్భర పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్షాదివస్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలపై ఉంది. కేసీఆర్ పదేండ్ల పాలన ఒక స్వర్ణయుగం. ప్రస్తుత కాంగ్రెస్ పాలన మరో రాతియుగం. సీఎం రేవంత్‌ది బూత్‌ల నోరు. ఆయనొక అబద్ధాల కోరు. చిట్టినాయుడి చిల్లర పాలనలో అందరూ బాధ పడుతున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో పాడిపంటలతో పచ్చబారిన తెలంగాణ గడ్డ నేడు కాంగ్రెస్ ఏడాది పాలనలో మళ్లీ ఎండిపోయింది. కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచిండు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషం వెల్లివిరిసింది. రేవంత్‌రెడ్డి ఎల్-3 సీఎం, లంగా, లఫంగా, లుచ్చా మాటలతో తెలంగాణను ముంచిండు. రైతుబంధు కాంగ్రెస్ రాబంధుల పాలైంది.
కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రైతులకు టోపీ పెట్టింది. పెన్షన్లు పెరుగుడు దేవుడెరుగు ఉన్న పెన్షన్లకే మంగళం పాడిండు. పెన్షన్లు ఇవ్వకుండా అవ్వతాతల, అక్కాచెల్లెళ్ల, విధివంచితుల కడుపు కొట్టిన ఘనుడు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ప్రజలకు సమాధానమివ్వాలి. మీ పాలన అంత బాగుంటే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి ఎందుకు వచ్చింది? వద్దురో నాయనా ఈ దగాకోరు కాంగ్రెస్ పాలన అంటూ ప్రజలు ఎందుకు భగ్గుమంటున్నారు? ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? నువ్వు ఘనంగా చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది ? ఎక్కడికెళితే అక్కడ ఎన్నికల హామీలను అమలు చేస్తామని దేవుళ్లపై ప్రమాణాలు చేసిండు.
అమలుచేయలేక బీఆర్ఎస్పై, కేసీఆర్ కుటుంబంపై తిట్ల పురాణం మొదలుపెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలపై అరాచకాలు పెరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. నన్ను కూడా వేధిస్తున్నారు. పోలీసులు అరాచక శక్తులకు కొమ్ము కాస్తున్నారు. అందరి పేర్లు పింక్‌బుక్‌లో ఎక్కిస్తున్నాం. వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే. అందరి లెక్కలు తేలుస్తాం. పోవాలి కాంగ్రెస్.. మళ్లీ రావాలి కేసీఆర్ అంటూ దీక్షా దివస్ స్ఫూర్తితో పోరాడుదాం.
– ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే సమస్యలకు పరిష్కారమని ఆనాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష యావత్ తెలంగాణతో పాటు దేశాన్ని కదిలించింది. ఆయన మొక్కవోని దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారు. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమం, ప్రజల్లో ఉన్న రాష్ట్ర కాంక్షను గమనించిన కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది. తీరా అధికారంలోకి వచ్చాక 2009 వరకు రాష్ట్రం ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది.
దీంతో కేసీఆర్ అటు కేంద్ర మంత్రి పదవులను, రాష్ట్రంలో మంత్రి పదవులను వదిలేశారు. రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి వంచించిన కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి రాష్ర్టాన్ని సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ నవంబర్ 29, 2009లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
హాస్పిటల్లోనే 11 రోజుల పాటు దీక్ష కొనసాగించారు. దీంతో విద్యార్థిలోకం, మేధావులు, ఉద్యోగులు తెలంగాణ సబ్బండవర్గాలు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి. కేసీఆర్ దీక్షా ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితమే డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చింది. కేసీఆర్ దీక్షకు ఇంత ప్రాధాన్యత ఉండడంతోనే గత 15 సంవత్సరాలుగా నవంబర్ 29న దీక్షా దివస్‌గా జరుపుకొంటున్నాం.
ఆనాడు చిన్నవయస్సు ఉన్న పిల్లలు ఇప్పుడు 20 ఏండ్లు నిండిన యువతగా మారారు. వారికి రాష్ట్ర ఏర్పాటు అవశ్యకత, ఉద్యమ భావజాలం, కేసీఆర్ దీక్షపై పెద్దగా తెలియదు. అందుకే రాష్ట్ర ఏర్పాటులో జరిగిన పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈనెల 29న దీక్షాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 500 పైచిలుకు కార్యకర్తలు కార్యక్రమానికి తరలిరావాలి. కాంగ్రెస్ నాయకులు ఊర్లో చెప్పుకుంటూ తిరగడానికి ఏం లేదు. ప్రజలు కొట్టేలా ఉన్నారని గ్రహించి, జిల్లా కేంద్రంలో ఉంటూ పైరవీలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ సుశిక్షుతులైన కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలి. రాబోయే రోజుల్లో మీరే కాబోయే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి