ఆర్మూర్‌టౌన్/ఖలీల్‌వాడి, మే18: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి అగ్ని ప్రమాద ఘటనా జరిగిన స్థలానికి వెళ్లే తీరిక లేదా? అని ప్రశ్నించారు.
మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పే బాధ్యతను మరిచారని విమర్శించారు. ముఖ్యమంత్రికి అందాల పోటీలు, విహారయాత్రలు, ఫొటోషూట్లు తప్ప ప్రజల ప్రాణాలు పట్టవా? అని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధులవుతున్నారని పేర్కొన్నారు. ఎంతో మంది క్షతగాత్రులై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి అగ్నిమాపక శాఖ సంసిద్ధతపై సమీక్ష నిర్వహించాలని సర్కార్‌కు సూచించారు.