ఖలీల్‌వాడి, మే 16: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమీషన్ల పాలన అని, తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పనులను బట్టి మంత్రులకు లంచాలు ఇవ్వనిదే ఫైలు ముందుకు కదలదని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి మంత్రి పేషీలో ఇదే తంతు కొనసాగుతున్నదని, సచివాలయం అంతా అవినీతి కంపు కొడుతున్నదని తెలిపారు.
ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులకు డబ్బులు ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ చెప్పారని, ఆమె కామెంట్స్‌పై రాహుల్ గాంధీ స్పందించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద అవినీతి భూతమని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఆయన శరాఘాతమని నిప్పులు చెరిగారు. పీసీసీ అంటే ప్రదేశ్ కరెప్షన్ సెంటర్ అని, అది ఇండియన్ నేషనల్ క్రైమ్ అండ్ కరప్షన్ పార్టీ అని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అవినీతి పునాదుల మీద పెరిగిన కాంగ్రెస్ పార్టీ పంచభూతాలనే భోంచేసిన పాపాల పుట్ట అని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియా అని ఆరోపించారు. నాటి ఆంగ్లేయులది, నేటి కాంగ్రెస్‌ది ఒకటే వంకరబుద్ధి అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఈస్టిండియా కంపెనీ అయితే బీజేపీ నార్తిండియా కంపెనీ అని.. ఈ రెండు పార్టీలూ దేశాన్ని దోచుకునే దోపిడీ కంపెనీలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ దేశాన్ని పాడు చేస్తున్న మిడతల దండు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే సంపన్నులకు ఆపన్నహస్తం, పేదలకు రిక్తహస్తం అని, అందినకాడికి ప్రజాధనాన్ని నొక్కేయడం, మెక్కేయడంలో ఆ పార్టీది అందెవేసిన చేయి అని తెలిపారు. కాంగ్రెస్ గరీబీ హఠావోను గాలికొదిలేసి, పైసా కమావో బాట పట్టిందని ధ్వజమెత్తారు. అవినీతి అమీబా కాంగ్రెస్ అని, దాని డీఎన్ఏలోనే కరప్షన్ ఉన్నదని నిప్పులు చెరిగారు. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సర్కారు అవినీతి చట్టబద్ధమనే విధంగా ఉన్నాయని, కాంగ్రెస్ అవినీతి బాగోతాలపై సభా కమిటీ వేయాలని, సీబీఐతో విచారణ జరిపించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.