ఎల్లారెడ్డి రూరల్/నాగిరెడ్డిపేట/లింగంపేట, ఆగస్టు 30: భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు ముంపునకు గురైన ఎల్లారెడ్డి మండలంలోని బొగ్గు గుడిసె, ఆజామాబాద్, అన్నాసాగర్, తిమ్మారెడ్డి శివారుతోపాటు నాగిరెడ్డిపేట మండలంలోని జప్తిజాన్కంపల్లి, నాగిరెడ్డిపేట, చీనూర్, మేజర్‌వాడి, లింగంపేట మండలం కన్నాపూర్, పోల్కంపేట, కోమట్‌పల్లి, పోతాయిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. బొగ్గుగుడిసెలో ముంపునకు గురై నష్టపోయిన దుకాణాలు, పంట పొలాలు, కోతకు గురైన రోడ్డు, ఆజాబామాద్, అన్నాసాగర్, జప్తిజాన్కంపల్లి, నాగిరెడ్డిపేట, చీనూర్, మేజర్‌వాడి గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు.
రైతులకు ధైర్యం చెప్పారు. నాగిరెడ్డిపేట శివారులో గండి పడి కొట్టుకుపోయిన రాంరెడ్డి చెరువును పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పోచారం ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిశీలించారు. గంగామాతకు కొబ్బరి కాయలు కొట్టారు. తిమ్మారెడ్డి శివారులో వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయిన పౌల్ట్రీఫారాన్ని పరిశీలించి, యజమాని పృథ్వీరాజ్‌ను ఓదార్చారు. ఈ సందర్భంగా జాజాల స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ చెరువు తెగిపోవడంతో ఎక్కువగా పంట, ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ఇంతవరకు అధికారులు, ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయిలో పర్యటించలేదని మండిపడ్డారు.
కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా నష్టపోయింది ఎల్లారెడ్డి నియోజకవర్గమని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యంతో ఇంతపెద్ద మొత్తంలో నష్టం సంభవించినా ఇప్పటివరకు సీఎం, ఒక్క మంత్రి కూడా పర్యటించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ గెలిచిన నాయకుడు కూడా ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఏరియల్ సర్వే ద్వారా ఏం తెలుస్తదని, క్షేత్రస్థాయిలో తిరిగితే నష్టం కనిపిస్తుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామానికి చెందిన కీసరి ఎల్లమయ్య(కాంగ్రెస్) శనివారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.