నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం ద్వారా న్యాయం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందన్నారు. ముఖ్యంగా సెక్షన్–8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు.
న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా చివరకు నిజం గెలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని మండిపడ్డారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి ఈ హైకోర్టు తీర్పు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం, మతీన్ తదితరులు పాల్గొన్నారు.