సిరికొండ, నవంబర్ 16: రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచిన రేవంత్‌రెడ్డి.. ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ తండ్రి ఇటీవల మరణించగా.. బాధిత కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రౌడీ రాజకీయం చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆరోపించారు.
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కానీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. ఇప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. తులం బంగారం,మహిళలకు రూ.2500, సన్న వడ్లకు బోనస్, ఉద్యోగాలు ఇలా అన్నీ మరిచిపోయారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని, రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ చేసిన సంక్షేమాన్ని చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణను బీఆర్ఎస్ ప్రభుత్వం అభినందించి, తగు విధంగా సత్కరించిందని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి ఐదు ఎకరాల భూమిని, కామారెడ్డిలో 300గజాల్లో ఇల్లు, రూ.25లక్షల నగదు అందజేశారని గుర్తుచేశారు. అప్పటికి ఆమె చిన్న వయస్సుది కావడంతో ఉద్యోగం ఇవ్వలేదన్నారు. మేజర్ అయ్యాక ఉద్యోగం ఇచ్చే ఆలోచన చేశామని, కానీ ఇంతలోనే ప్రభుత్వం మారిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్ణకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. ఆయనవెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రమాకాంత్, భూషణ్‌రెడ్డి, నర్సారెడ్డి, అబ్బాస్, కన్క శ్రీనివాస్, గోపాల్, సురేందర్, గంగారెడ్డి, రమేశ్‌రెడ్డి, సంతోష్, మంజుల, రాములు నాయక్, రాజు, శివారెడ్డి, అజయ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.