వేల్పూర్, ఏప్రిల్ 14 : బాల్కొండ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కు ల పంపిణీలో జాప్యం చేస్తూ లబ్ధిదారులైన ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టొద్దని మాజీ మం త్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వేల్పూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ పూర్తిగా ఎమ్మెల్యే పరిధిలోని అంశమని తెలిపారు.
ఇటీవల బడ్జెట్ సమావేశాల సమయంలో నియోజకవర్గంలో 847 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. చెక్కుల పంపిణీలో జాప్యం జరగొద్దనే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శుల ద్వారా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆర్డీవోకు నెల రోజుల క్రితం లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
కానీ మూడురోజుల క్రితం ఆర్డీవో ఫోన్ చేసి చెక్కుల పంపిణీ కోసం ఇన్చార్జి మంత్రి నియోజకవర్గానికి వస్తున్నారని సమాచారమిచ్చారని తెలిపారు. జీపీ కార్యదర్శుల ద్వారా చెక్కులను పంపిణీ చేయలేదని, మంత్రి పంపిణీ చేస్తారని నెలరోజులుగా అలా గే ఉంచినట్లు చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు వారి అహంకారం, అధికార ద ర్పం కోసం ఎమ్మెల్యేతో పంపిణీ చేయొద్దనే స్వార్థబుద్ధితో చెక్కులను లబ్ధిదారులకు అందించకుండా ఆపివేశారని అన్నారు.
జీపీ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేయాలి
ఇన్చార్జి మంత్రి పంపిణీ కార్యక్రమానికి వస్తున్నారంటే స్వాగతిస్తామని, ఆయన మీద గౌరవంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోనే తాను ఉన్నట్లు తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం మళ్లీ రద్దయినట్లు అధికారులు సమాచారం ఇచ్చారన్నారు. మంత్రి రాకపోతే పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని, తాను పంపిణీ చేస్తానంటే..అధికారులు మాత్రం మంత్రి మళ్లీ సమయం ఇస్తారని చెప్పారని తెలిపారు. చెక్కుల పంపిణీ ఇప్పటికే ఆలస్యమైనందున లబ్ధిదారులకు నేరుగా కార్యదర్శుల ద్వారా అందజేయాలని డిమాండ్ చేశారు.
తులం బంగారం ఎప్పుడిస్తారు?
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రూ. లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆడబిడ్డలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారం ఇస్తే 16 నెలలైనా తులం బంగారం కాదుకదా..తులం ఇను ము కూడా ఇవ్వడంలేదని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు చెక్కులు అందుకున్న ప్రతిఒక్క ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.