నిజామాబాద్, డిసెంబర్ 11 : (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగంలా కొనసాగగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే తెలంగాణను కారుచీకట్లలోకి నెట్టి వేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఊరూరా సంక్షేమం, అభివృద్ధి ఫలాలతో కేసీఆర్ అందరివాడిలా గుర్తింపు తెచ్చుకుంటే… ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చివేతల భయంతో జనాలను రేవంత్ రెడ్డి భయాందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి(హ్యాట్రిక్) విజయం సాధించి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ నిర్వహించింది.
ఈ సందర్భంగా తాను నిజామాబాద్ జిల్లాతోపాటు తాను బాధ్యత వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలు, ఈ ప్రభుత్వంలో పూర్తి చేయించాల్సిన పనులు, ప్రస్తుతం ప్రతిపక్షంలో పోషించాల్సిన పాత్రపై అభిప్రాయాలను వెలిబుచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రజలను వంచిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు మహాలక్ష్మి ద్వారా రూ. 2500, పెన్షన్ రూ.4000 పెంపు, తులం బంగారం, రైతు భరోసా, కౌలు రైతులకు భరోసా, ఉపాధిహామీ కూలీలకు 12వేలు, గృహాలక్ష్మి, విద్యార్థులకు యువ వికాసం లాంటి గ్యారెంటీలు ఏడాది కావస్తున్నా ఊసే లేదు. రూ.500లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. రైతు రుణమాఫీ, 500 బోనస్ అరకొరగా ఇచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయలేదు.
అభివృద్ధికి నమూనాగా బాల్కొండను తీర్చిదిద్దాం..
పదేండ్లకాలంలో బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దిన. వట్టిపోతున్న ఎస్సారెస్పీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రూ. 1900 కోట్లతో ‘పునరుజ్జీవం’ మంజూరు చేయించి పూర్తి చేయించాను. ప్యాకేజీ -21 ఏ ద్వారా నియోజకవర్గంలో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరందించే పనులకు రూ.1200 కోట్ల నిధులు ఇప్పటికే ఖర్చు చేశాం. పనులు కొనసాగుతున్నాయి.నియోజకవర్గంలో సుమారు 30 గ్రామాలను కలుపుతూ ప్రవహించే కప్పల వాగు, పెద్దవాగులపై రూ.200 కోట్లతో 26 చెక్‌డ్యామ్‌లను మంజూరుచేసి, 20 చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులను పూర్తిచేశాం. సుమారు 200 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లు, బ్రిడ్జిలకు మరమ్మతులు పూర్తిచేశాం.అసంపూర్తిగా మిగిలిపోయిన లక్ష్మీ కెనాల్‌కు రూ.11 కోట్లతో ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. రెండు మైనార్టీ, రెండు బీసీ, ఒక ఎస్సీ గురుకుల పాఠశాల, మానాలలో ట్రైబల్ గురుకుల కళాశాలను ఏర్పాటు చేశారు.బాల్కొండ కేంద్రంగా డిగ్రీ కాలేజీ ఏర్పాటుచేశాం. లింబాద్రి గుట్ట లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశాం.
ఆలయాలను అభివృద్ధి చేశా..
నియోజకవర్గంలో రూ.8 కోట్లతో 87 దేవాలయాలను మంజూరుచేయించా. సుమారు రూ.3 కోట్లతో నియోజకవర్గంలో మసీదులు, చర్చిలను అభివృద్ధిచేశా. సుమారు 20కి పైగా నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశా. పదేండ్ల కాలంలో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన 14వేల మందికిపైగా బాధితులకు రూ.43 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీచేశాను.
చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి..
నియోజకవర్గంలో మంజూరైన ప్యాకేజీ -21 పనుల్లో ముఖ్యమైన పంపుహౌస్, మెయిన్ పైపులైన్ పనులు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పనులు వేగవంతంగా పూర్తి చేసి 80 వేల ఎకరాలకు సాగు నీరందించాలి. భీమ్‌గల్ వంద పడకల దవాఖాన నిర్మాణంలో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేవాలి. ఎస్సారెస్పీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. వేల్పూర్, కమ్మర్‌పల్లిలో జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వంలో నేను మంజూరు తీసుకొచ్చిన అనేక పనులను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.
ఇంటింటికీ భగీరథ నీరు
భీమ్‌గల్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చి రూ.100 కోట్లతో అభివృద్ధి చేసిన. మిషన్ భగీరథ చైర్మన్‌గా నియోజకవర్గంలో 100 శాతం ఇంటింటికీ నల్ల ద్వారా సురక్షిత తాగునీరు అందించడంలో విజయం సాధించిన. సొంత, సీఎస్ఆర్ నిధులు రూ.2 కోట్లతో ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించి, ఆక్సిజన్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ భూ మిలో 1200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చాం. నియోజకవర్గంలో సుమారు 18 సబ్స్టేషన్లు, 50 కి పైగా 5 ఎంవీ ట్రాన్స్ఫార్మర్లను మంజూరుచేశాం.
శరవేగంగా నిజామాబాద్ అభివృద్ధి
రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కేసీఆర్ ఆశీస్సులతో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాను. జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు నిధులు తీసుకువచ్చిన. జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన మాధవ్‌నగర్ ఆర్వోబీ రూ.93 కోట్లతో (63 కోట్లు రాష్ట్రం 30 కోట్ల రైల్వే) నిర్మాణం చేపట్టాం. అర్సపల్లి ఆర్వోబీ మంజూరై పనులు కొనసాగుతున్నాయి. డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాం. నా శాఖ పరిధిలో రూ.35 కోట్లతో నూతన కలక్టరేట్ భవనాన్ని నిర్మించాం. జిల్లా ప్రభుత్వ దవాఖానను ఎంతో అభివృద్ధి చేశాం.