నాగిరెడ్డిపేట, మే 30: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. శనివారం ఆయన మండలంలోని మాల్తుమ్మెద, కన్నారెడ్డి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేముల రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. ధాన్యం కుప్పలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం కొనే దిక్కులేక రైతులు రూ. 2900 వదులుకొని కేవలం రూ.1700లకు దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
80 శాతం ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి కేవలం 30 శాతం మాత్రమే రెండు నెలలుగా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. రెండు నెలలుగా మాల్తుమ్మెదలో కేవలం 34 లారీలు మాత్రమే వచ్చాయని, ఇంకా 67 శాతం ధాన్యం కేంద్రంలోనే ఉన్నదని తెలిపారు. ధాన్యం మొత్తం తరలించడానికి ఇంకా రెండు నెలల సమయం పట్టేలా ఉన్నదన్నారు. రెండు నెలులు గడుస్తున్నా వడ్లను తూకం చేయడంలేదని, కాంటా చేసినా ధాన్యం బస్తాలు కేంద్రం నుంచి తరలించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. రైస్ మిల్లులకు పంపిన లారీలు ఖాళీ కావడానికి ఇంకా వారం రోజుల సమయం పడుతుందని, దీంతో మిల్లర్లు కోత విధిస్తున్నారని ఎటుచూసినా రైతుకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతు నుంచి కేవలం ధాన్యం సేకరించిన ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని మండిపడ్డారు. అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసిపోయి మొలకలు కూడా వస్తున్నాయన్నారు.లారీలు రాక, ధాన్యం తూకం వేయక రైతులతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వేముల అక్కడి నుంచే డీఎస్వోకు ఫోన్ చేసి మాట్లాడారు. ధాన్యం వెంటనే తరలించాలని లేకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే గాని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మిల్లర్లు కట్ చేస్తున్న ధాన్యం కోత డబ్బులను కాంగ్రెస్ నాయకులు పంచుకుంటున్నారని, అందుకే మిల్లర్లు కోత విధించినా ఒక్కరూ మాట్లాడడంలేదని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి ధాన్యం వారంలోగా కొనుగోలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమచేసేవారని, సమయానికి రైతుబంధు ఇచ్చేవారని రైతులు కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటున్నారని వేముల తెలిపారు. జొన్నలు ఎకరాకు 30 క్వింటాళ్లు పండితే కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతావి ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. అధికారులు, నాయకులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
వేముల వెంట ఏఎంసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య, సొసైటీ చైర్మన్ నర్సింహులు, మాజీ జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌నాయక్, తానాజీరావు, కపిల్‌రెడ్డి, సర్పంచ్ వంశీగౌడ్, మాజీ సర్పంచ్ మురళి, మాజీ ఎంపీటీసీ నారాయణ, దుర్గారెడ్డి, ఫరీద్, నారాయణ, కాంత్‌రెడ్డి, మంగళి యాదగిరి తదితరులు ఉన్నారు