వేల్పూర్, జనవరి 31: అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయకపోతే రాజీనామా చేస్తారా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లోపే హామీలు నెరవేర్చాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే హామీలు వందశాతం నెరవేరుతాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం..హామీల అమలు నుంచి దూరంగా పారిపోవడమే అని విమర్శించారు. వేల్పూర్ మండలం లక్కోరాలోని ఓ ఫంక్షన్‌హాలులో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా.. వేములతోపాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని కట్టబెట్టలేదని, కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో మాత్రమే ఆ పార్టీ గెలిచిందన్నారు. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేసి వచ్చినట్లుగా కాంగ్రెస్ దుష్ప్రచారాలతో లబ్ధి పొందిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల రుణం తెచ్చుకోవాలని రైతులకు చెప్పాడని, అది జరిగిందా అని ప్రశ్నించారు. రైతుబంధు సాయం రైతులందరికీ ఇంకా ఎందుకు అందలేదో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరెంట్ బిల్లులు కట్టవద్దని, తాము రాగానే గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తామని నవంబర్ 11న రేవంత్‌రెడ్డి చెప్పాడని గుర్తు చేశారు. ఇప్పటివరకు సదరు పథకం అమలుకానందున రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రకారం బిల్లులు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. బాల్కొండ నియోజకవర్గంలో మంజూరైన 6 వేల గృహలక్ష్మీ ప్రొసీడింగ్‌లను రద్దు చేశారన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తూ నిర్బంధాలకు గురి చేస్తే.. ధర్నాలకు దిగి ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీలకు సంబంధించిన వీడియోలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ప్రదర్శించారు.
రైతుబంధు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులేవని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు లబ్ధి పొందారు తప్ప..కార్యకర్తలు నిస్వార్థంగా పని చేశారని తెలిపారు. తెలంగాణను తీసుకొచ్చి బాగు చేసిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకోసం బరి గీసి పోరాడుతారన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఎలా వచ్చిందో ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్రంలో 99 శాతం 10 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులే ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. గత ఆగస్టులో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వమే భర్తీ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం విడ్డూరమన్నారు. సొమ్మొకరిది..సోకొకరిది అనే రీతిలో రేవంత్‌రెడ్డి తీరు ఉందన్నారు. జిల్లా ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు హామీతో అబద్ధపు బాండ్ పేపర్ ఇచ్చి గెలిచిన వైనం, బీజేపీ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నర్సింహనాయుడు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.