మోర్తాడ్, ఆగస్టు 28: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా బీఆర్ఎస్ శ్రేణులు వారికి సహకారం అందించాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. రెండు, మూడు రోజులుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, గోదావరి పరిసర ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని సూచించారు. చెరువులు నిండి కట్టలు తెగే ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలెవరూ చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటూ లోతట్టు ప్రాంతాల్లో అవసరమున్నచోట ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే వారికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ప్రజల ఇబ్బందులను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.