Kamareddy | కామారెడ్డి : ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీపై ఆరోపణలు సరికావని, ఆయనను విమర్శించే స్థాయి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి లేదని డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. షబ్బీర్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు చట్టబద్ధంగా డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేశారని, ఎవరిని బెదిరించి కబ్జాలు చేయలేదని పేర్కొన్నారు.
చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని, మర్యాద తప్పితే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తారని హెచ్చరించారు. దమ్ముంటే సీఎస్ఐ గ్రౌండ్ కు రావాలని డిమాండ్ చేశారు. ఎక్కడికి రమ్మంటావో వస్తామని తామ కుడా బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ శ్రేణులు సవాల్ విసిరారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజలే బట్టలు ఊడదీసే రోజు దగ్గర్లోనే ఉందని, అంతేకాకుండా ఎర్రగడ్డకు తరలించే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. టేక్రియాల్ నుంచి లింగాపూర్ కు 100 ఫీట్ల రోడ్డును ఎమ్మెల్యే కాకముందు అడ్డుకుని, ప్రస్తుతం ముందుండి ఎందుకు వేయిస్తున్నావని ప్రశ్నించారు.
అందులో ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వరుస బెదిరింపులు ఎమ్మెల్యే తన సొంత మిత్రులు, వ్యాపార భాగస్వాములను కూడా వదలలేదని నాయకులు ఆరోపించారు. టీవీ కేబుల్ నెట్వర్క్ పేరుతో పార్టీ నాయకులను నట్టేట ముంచారని, అశోక్ నగర్ కాలనీకి చెందిన ఒక అమాయకుడు ఇంటి కాగితాలు బ్యాంకులో పెట్టి రూ.20 లక్షల అప్పు చేసి తీర్చలేక పారిపోయారని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.