వినాయకుని నగర్, ఆగస్టు 26 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ అధికారులు పలు షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని మాలపల్లి ఏరియాలో గత కొంతకాలంగా నడుపుతున్న పక్షుల షాపులలో ఫారెస్ట్ చట్టాన్ని అతిక్రమించి అడవుల్లో ఉండాల్సిన పక్షులను విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఫారెస్ట్ బృందాలు దాడులు నిర్వహించారు. ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మూడు షాపులలో రామచిలుకలు, కంజు పిట్టలను విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
అనిమల్ లవర్ షాప్, హ్యాపీ బర్డ్స్ షాప్, ఏ 1 ఫేమస్ షాప్ మూడు షాపులలో వేరు వేరుగా వివిధ రకాల రామచిలుకలు, కంజు పిట్టలు మొత్తం 71 పక్షులను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపుల నిర్వాహకులైన సయ్యద్ బిన్ ఖలీద్, రైమాన్ ఖాన్, సయ్యద్ సిరాజుద్దీన్ అనే ముగ్గురి పై ఫారెస్ట్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కేసులు నమోదైన వీరికి ఫారెస్ట్ జిల్లా అధికారి ఫారెస్ట్ సెక్షన్ల ప్రకారం జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. షాపుల నుండి స్వాధీనం చేసుకున్న పక్షులను అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అధికారులు తెలిపారు.