నిజామాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మూడు, నాలుగురోజులుగా ఉమ్మడి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండా అటవీశివారులో ఓ ఆవుపై పులిదాడిచేయగా.. పెద్దపులి జాడ కనుగొనేందుకు అటవీశాఖాధికారులు రంగంలోకి దిగారు. మూడు దశాబ్దాల తర్వాత వలస వచ్చిన పెద్ద పులి ప్రా ణాలతోనే ఉన్నదా? లేదా? అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు పెద్ద పులులకు సహజ ఆవాసంగా ఉన్నాయి. ఇక్కడ దట్టమైన వృక్ష సంపద, సమృద్ధిగా ఆహార వనరులు, అనుకూలమైన పర్యావరణ పరిస్థితులను కలిగి ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అడవులు ఈ జాతి జంతువులకు అంతగా అనువైనవి కావు. అడవులు చిన్నవిగా, తక్కువ దట్టంగా ఉండడం, ఆహార వనరుల కొరత, మానవ జనాభా సాంద్రత ఎక్కువగా ఉండడం వంటి అనేక కారణాలు పెద్ద పులికి ముప్పుగా పరిణమించనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద పులి రావడం దానికి, స్థానిక ప్రజలకు సైత ప్రమాదకరంగా మారింది.
ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతం పెద్ద పులికి ఆవాసయోగ్యంగా లేనందున పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు, ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. పెద్ద పులి(పాంథరా టైగ్రిస్) సాధారణంగా దట్టమైన అడవులు, గడ్డి భూములు, నీటి వనరులు సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంది. కీకారణ్యం వంటి ప్రాంతాలు దాని ఆహార గొలుసు, రక్షణ, పునరుత్పత్తికి అనువైన వాతావరణాన్ని అందిస్తాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అడవులు చిన్నవి. అందులోనూ విచ్ఛిన్నమైనవి. పోడు వ్యవసాయంతో చెల్లాచెదురైన అడవితో పులి జీవనానికి అవసరమైన వనరులు చాలా తక్కువగా ఉన్నాయి.
పులి సంరక్షణ ఇప్పుడు అటవీ శాఖకు సవాల్‌గా మారింది. ఉమ్మడి జిల్లాలో జింకల ప్రాణాలనే కా పాడలేక పోతున్నారు. జాతీయ రహదారిపై చిరుతలు నిత్యం మృత్యువాత పడుతున్నప్పటికీ రక్షణ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కోటగిరి, పోతంగల్ మండలాల్లో మంజీరా పరీవాహక ప్రాంతంలో కుక్కల దాడుల్లో జింకలు మృత్యువాత పడుతున్నప్పటికీ అటవీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పుడు పులిని సంరక్షించేందుకు రంగంలోకి దిగడంపై సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయి. పులిని బంధించడానికి అనుభవం కలిగిన అటవీ అధికారులు మన వద్ద లేకపోవడం సవాల్‌గా మా రింది. మరోవైపు ఉన్నతాధికారులు ఈ ‘ఆపరేషన్ టైగర్’పై దృష్టి సారించారు. సురక్షితమైన ప్రాంతానికి పెద్దపులిని తరలించడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కానీ అడవుల్లో పులికి ముప్పు మిన హా రక్షణ అనేది ఉంటుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం వేటగాళ్ల చేతుల్లో జంతువు లు బలవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలోనూ అనేక వన్యప్రాణులు చనిపోతున్నాయి. ఈ పరిస్థితిలో పులిని రక్షించడం సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం ఉన్నది. ఇక్కడ మానవ కదలికలకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాన్ని వదిలి పులి బ యటికి వచ్చిందంటేనే అనుమానాలకు తావిస్తోంది. మానవుల కదలికలు పెరగడం, వేటాడడం వంటి కారణాలతో పులి బెదిరి పోయి ఆహారం కోసం వేటాడుతూ దారి తప్పి వలస వచ్చినట్లు అర్థమవుతున్నది.
అడవి లోతుల్లోకి అటవీ శాఖ సిబ్బంది మినహా ఇతరులు వెళ్లే అవకాశం లేదు. ఇన్ని రోజులపాటు అడవుల్లో ట్రాకింగ్ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందనే అంతా భావించారు. పులి తప్పిపోయి ఉమ్మడి జిల్లా అటవీప్రాంతానికి రావడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారుల పనితీరును తేటతెల్లం చేసినట్లవుతున్నది. సిరికొండ మీదుగా రామారెడ్డి, మాచారెడ్డి ప్రాంతాల్లోని అడవుల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. పులి దాడిలో చనిపోయిన ఆవును ఆధారంగా చేసుకుని పులి చాలా ఆకలితో ఉన్నట్లుగా గుర్తించారు. పాదముద్రలను సేకరించి పులిగా నిర్ధారించారు. కానీ అధునాతన సాంకేతికత ఎందుకు ఉపయోగపడడంలేదన్నది అంతు చిక్కడం లేదు. అడవుల్లో ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి ఇప్పుడు పని చేయడం లేదా? అనే అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి. రేడియా కాలర్లు, కెమెరా ట్రాప్‌లు, జీపీఎస్ పరికరాలు ఏమైనట్లు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పులి వంటి అరుదైన జాతుల వలసలను ఎప్పటికప్పుడు గుర్తించడంలో అటవీ శాఖ పూర్తిగా విఫలమైంది. వన్యప్రాణుల రక్షణలో కీలక పాత్ర పోషించే ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా పులి జాడను కనిపెట్టకపోవడం విడ్డూరంగా మారింది. రామారెడ్డి, మాచారెడ్డి అడవుల్లోనే పెద్ద పులి దాగి ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, అక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ భూభాగంలోకి పులి వెళ్లే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కాం క్రీట్ జంగిల్‌గా మారిన చుట్టుపక్కల ప్రాంతాల్లో బెంగాల్ టైగర్ బతకడం చాలా కష్టం. జన నివాసాల్లోకి పులి అడుగు పెడితే భయంతో, స్వీయ రక్షణ చర్యల్లో దాడులు చేసే అవకాశాలున్నా యి. అంతలోపు పులిని సంరక్షిస్తేనే ఫలితం ఉంటుంది.
మాచారెడ్డి/రామారెడ్డి, జూలై 15 : రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్తండాలోని అటవీ ప్రాంతంలో పులి దాడిలో ఓ ఆవు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే పులిని చంపడానికి ఆవు యజమానితోపాటు మరో ముగ్గురు ఆవు కళేబరంపై పురుగుల మందు చల్లారు. దీనిని అటవీశాఖ అధికారులు గుర్తించగా, విష ప్రయోగం చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మాచారెడ్డి ఎఫ్ఆర్వో దివ్య మంగళవారం తెలిపారు. అరెస్టు చేసినవారిలో స్కూల్ తండాకు చెందిన భుక్య మహిపాల్, గంగావత్ కన్నెరాం, సాలవాత్ గోపాల్, పిపావత్ సంజీవ్ ఉన్నారని ఆమె తెలిపారు. వన్యమృగాలపట్ల క్రూరంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.