వినాయక్‌నగర్, జూన్15: తమ ప్రాణాలకు రక్షణ ఉంటేనే అటవీ భూములను రక్షించగలుగుతామని, ప్రభుత్వం వెంటనే తమ రక్షణ కోసం ఆయుధాలివ్వాలని అటవీశాఖ అధికారులు కోరారు. మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులు, సిబ్బందిపై దాడికి నిరసనగా శనివారం జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అటవీ ప్రాంతాలను కాపాడేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నామన్నారు. అటవీ భూములను కబ్జా చేసేందుకు యత్నించే వారిని అడ్డుకుంటే తమపైనే దాడులకు పాల్పడుతున్నారని, తమ ప్రాణాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
గ్రామస్థాయిలో ఉండే కొంతమంది నాయకులు రెచ్చగొట్టడంతోనే కాల్పోల్ లాంటి దాడులు జరుగుతున్నాయని తెలిపారు. దాడులు చేసే వారిని అడ్డుకునేందుకు తమ వద్ద ఆయుధాలు లేవని, మళ్లీ ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. గతంలో ఇందల్వాయి ఏరియాలో ఫారెస్టు అధికారిని హత్య చేసిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ర్యాలీ అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌తోపాటు అదనపు డీసీపీని కలిసి తమ రక్షణ కోసం అవసరమైనచర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో సుధాకర్, ఎఫ్ఆర్వోలు రవిమోహన్‌భట్, పద్మారావు, శ్రీనివాస్, రవీందర్, ఎన్బీ నాయక్, డీఆర్వో సుధాకర్‌రావుతోపాటు సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.