NEET Exam | కంటేశ్వర్, జూన్ 06 : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు సంబంధించి ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలంగాణ ఇన్చార్జి అభిషేక్ సింగ్, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నీట్ పరీక్ష దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన పరీక్ష అని పేర్కొన్నారు.
గతంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి నీట్ పరీక్ష నిర్వహణలో గోప్యత, భద్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రశ్నపత్రాల రవాణా, భద్రపరిచే ప్రక్రియ, పరీక్షా కేంద్రాల నిర్వహణ తదితర అంశాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.95 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, 208 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో కేంద్రాలు ఉన్నందున ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ పరికరాలు, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం రబీలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ తదితర జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తైందని, మిగిలిన జిల్లాల్లో కూడా రెండు రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ నెల 9న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్టీసీ అద్దె బస్సులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. మహిళా సంఘాల సభ్యుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫార్మ్స్ త్వరగా కుట్టించి ఇచ్చేలా చూడాలని సూచించారు. ఐడీవోసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, నీట్ పరీక్షను జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ నెల 9న మహిళా సంఘాలకు హైదరాబాదులో జరిగే బస్సుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా నుంచి బయలుదేరే సభ్యులకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీవో సాయన్న, డీఏవో వీరస్వామి, పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, నీట్ పరీక్ష కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.