నిజామాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మేడిపండు చూడు మేలిమై నుండు… పొట్ట విప్పి చూడు పురుగులుండు… అన్నట్లుగా మారింది హోటళ్లు, రెస్టారెంట్ల తీరు. కొత్త, పాతవి అనే తేడా లేకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రం లో కుళ్లిన మాంసాన్ని, ప్రాణాంతక రసాయనాలు, చెడిపోయిన పదార్థాలను వినియోగిస్తున్నారు. వాటికే రంగులు అద్ది ఆహార ప్రియులకు వడ్డించి భారీగా దండుకుంటున్నా రు. ఆకలితో వచ్చే వారి ప్రాణాలు తీస్తూ అనైతిక వ్యాపారం చేస్తూ హోటళ్ల నిర్వాహకులు చేయరాని నేరాలకు పాల్పడుతున్నారు. పదిరోజుల్లో నిజామాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు ప్రధానమైన హోటళ్లపై దాడులు నిర్వహించారు. రెండింట్లోనూ కుళ్లిన చికెన్, మటన్ మాంసపు ముద్దలు, చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. వంటల్లో వాడేందుకు వీలులేని రసాయనాలను సైతం వినియోగిస్తుండడం తనిఖీల్లో బయటపడింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పేరుమోసిన రెస్టారెంట్లో పది రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తే విస్తూ గొల్పే వాస్తవాలు బయటపడ్డాయి. పశువులు, కుక్కలు కూడా తినడానికి వీళ్లేని ఆహారాన్ని ఫ్రిజ్‌లలో దాచి పెట్టారు. సముద్ర చేపలు, రొయ్యలతోపాటు చికెన్, మటన్, కుళ్లిన గుడ్లను సైతం ఫ్రిజ్జుల్లో ఉంచడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులే అవాక్కయ్యారు. బల్క్ ఆర్డర్లు, గ్రూపులుగా వచ్చే ఆహార ప్రియులకు ఈ చెడిపోయిన మాంసాన్ని కలిపేసి డీప్ ఫ్రై రూపంలో వడ్డిస్తున్నట్లుగా సదరు రెస్టారెంట్ నిర్వాహకులు చెప్పినట్లు తెలిసింది.

కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో కొత్తగా వెలిసిన రెస్టారెంట్లలోనూ ఇదే రకమైన తంతు ఉన్నట్లుగా పలువురు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానిప్పటికీ తనిఖీలు చేయలేదు. వినాయక్‌నగర్‌లో తాజాగా చేసిన దాడుల్లో ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఘోరమైన దుస్థితి బయటపడింది. ఇక్కడ కూడా విషపూరిత రసాయనాలు, కుళ్లిన మాంసం ముక్కలు లభించాయి. మందు ప్రియులకు వీటిని మత్తులో ఉన్నప్పుడు స్టఫ్ కింద వడ్డిస్తున్నట్లుగా అధికారుల విచారణలో వెల్లడైంది.
ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. నిరంతర తనిఖీలు చేపట్టి ఉంటే ఇలాంటి దుస్థితి ఉండేది కాదు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో హైదరాబాద్‌లో మొదలు పెట్టిన తనిఖీలు జిల్లాస్థాయికి పాకడంతో అక్రమార్కుల బండారం బట్టబయలైంది. బాధ్యతను మరిచి మామూళ్ల మత్తుకు అలవాటు పడడంతోనే తినుబండారాల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ బృందాలు కాలు పెట్టడం లేదన్న అపవాదు ప్రజల్లో ఉన్నది. అకస్మాత్తుగా ఫుడ్ సేఫ్టీ బృందాలు వారి బాధ్యతను నిర్వరిస్తుండడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వినాయక్‌నగర్, జూన్ 20: నగరంలోని పాంగ్రా పరిధిలో ఉన్న ఎమ్ఎస్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రెస్టారెంట్‌లోని ఫ్రీజ్‌లో నిల్వ ఉంచిన చికెన్, చికెన్ లెగ్ పీసులు, టేస్టింగ్ సాల్ట్, కలర్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫంగస్ వచ్చిన ఆహార పదార్థాలను చెత్తబుట్టలో పారేశారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి తారాసింగ్ నాయక్ మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించామన్నారు. నాణ్యతలేని, పాడైన ఆహార పదార్థాలు నిల్వ ఉంచడంపై రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామన్నారు. మరోసారి పునరావృతమైతే రెస్టారెంట్‌ను సీజ్‌చేస్తామని హెచ్చరించారు.