నిజామాబాద్ : జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడిన హౌస్ సర్జన్లు ( House surgeons ) ఐదుగురిపై ఆరు నెలలపాటు సస్పెన్షన్ ( Suspension ) వేటు పడింది. ఇప్పటికే ర్యాగింగ్ ( Ragging ) కు పాల్పడిన వైద్య విద్యార్థులపై బాధితులు రాహుల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ వన్ టౌన్ లో పోలీస్ కేసు నమోదు అయింది.
ర్యాగింగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దిద్దుబాటు చర్యలో భాగంగా యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ అయింది. అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి , మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈ మేరకు సమావేశం జరిగింది. ఇందులో ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురు మెడికోలను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.
మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం నుంచి శాశ్వతంగా బయటకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసుల నివేదిక ఆధారంగా భవిష్యత్తులో తుది నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రిన్సిపల్ కృష్ణమోహన్ పేర్కొన్నారు.