నిజామాబాద్, ఆగస్టు 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చెరువులు, కుంటలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో చేప పిల్లల పెంపకానికి మత్య్సకారులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. 100 శాతం రాయితీతో చేప పిల్లల విత్తనాన్ని అందించడం ద్వారా వారికి కొండంత భరోసాతో పాటుగా మత్స్యకారుల కుటుంబాలకు వెన్నుదన్నుగా కేసీఆర్ నిలిచారు. గ్రామాల్లో మత్స్యకారులకు గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండ లభించింది. ఫలితంగా మత్స్యకారులంతా ధైర్యంగా బతికారు. 2014కు మునుపు కాంగ్రెస్, అంతకుమునుపు టీడీపీ ప్రభుత్వాల్లోనూ ఇలాంటి పథకమే అందుబాటులో లేదు.
మత్స్యకారులను పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కనీసం చెరువులపై అజమాయిషీ చేసేందుకు మత్స్యకారులను అవకాశం లేకపోయేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మిషన్ కాకతీయతో బాగుపడిన చెరువుల్లోకి చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. తద్వారా మత్స్య అభివృద్ధికి కేసీఆర్ బాటలు వేశారు. 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ అద్భుత పథకం అటకెక్కింది. తూతూ మంత్రంగానే చెరువుల్లో చేప పిల్లలను వదిలే ప్రక్రియ సాగింది. డిమాండ్‌కు తగ్గట్లుగా చేప పిల్లలను అందించకపోవడంతో పాటుగా మత్స్యకారుల ఆశలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. 2025-26 సీజన్ ముంచుకొచ్చినప్పటికీ చేప పిల్లల విడుదలపై ఎలాంటి స్పష్టతను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది.
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు అలుముకున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కారు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో గంగపుత్రులంతా అయోమయానికి గురవుతున్నారు. సీజన్ అదనుదాటితే చేప పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. సర్కారు నుంచి చేప పిల్లల విత్తనం అందితే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. కానీ క్లారిటీ లేక ఇబ్బందికి గురవుతున్నారు. మత్స్య సహకార సంఘాల ద్వారా సొంతంగా నిధులు వెచ్చించి చేప పిల్లలను కొనుగోలు చేయడం భారీ ఖర్చుతో కూడుకున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మత్స్య సహకార సంఘాల్లో ఆర్థిక స్వావలంభన ఉన్నప్పటికీ భారీ ఎత్తున ఫిష్ సీడ్‌పై వెచ్చిస్తే కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వార భవిష్యత్తులో మార్కెటింగ్ సౌకర్యాలు, సొసైటీ బలోపేతానికి ఆర్థిక సమస్యలు వచ్చే వీలుంది. సర్కారే ఉచితంగా చేప పిల్లలు అందిస్తే కొండంత అండ లభిస్తుందనేది మత్స్యకారుల భావన. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ పథకానికి అందుతోన్న మద్ధతు స్వల్పమే.
చెరువుల్లో ఏటా రెండు సైజుల్లో చేప పిల్లలను వదిలి పెడతారు. 45 రోజులున్న 35-40మి.మీటర్లు పొడవున్న వాటిని ఏడాది మొత్తం నీరు నిల్వ ఉన్న జలాశయాల్లో పెంచుతారు. 75రోజులు వయసుంటే 80-100 మి.మీటర్లు పొడవున్న చేప పిల్లలను వదులుతారు. నీటిలో విడుదల చేసిన తర్వాత చేప పిల్లలు ఎదిగి కిలో సైజుకు చేరాలంటే ఆరు నెలల సమయం పడుతుంది. జూన్, జూలై నెలల్లో వదిలితేనే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు చేపలు పట్టి విక్రయించుకుని మత్స్యకారులు లాభాలు ఆర్జించే వీలుంటుంది. ఆలస్యంగా చేప పిల్లలను చెరువుల్లో వదిలితే వాటి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మండుటెండా కాలంలో చేతికి చేపలు వస్తే ఆ సమయంలో వాటిని సంరక్షించడం ఇబ్బందిగా మారుతుంటుంది. ఆగస్టు రెండో వారం ముగింపునకు వచ్చినప్పటికీ సర్కారు నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వెలువడకపోవడంతో మత్స్యకారులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరిసారిగా 8వ విడుత చేప పిల్లల అభివృద్ధి కార్యక్రమం 2023-24లో జరిగింది. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 1018 చెరువుల్లో 4కోట్ల 72లక్షల చేప పిల్లలను వదిలారు. 10లక్షలకు పైగా రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించారు. కామారెడ్డి జిల్లాలోనూ 697 చెరువుల్లో 2కోట్ల 78లక్షల 60వేల చేప పిల్లలను వదిలి మత్య్స అభివృద్ధికి పాటుపడ్డారు. చెరువుల్లో చేప పిల్లలను వదిలే సమయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీ బాధ్యుల సమక్షంలో సైజులు, చేప పిల్లల నాణ్యతను నిర్ధారించిన తర్వాత మాత్రమే చెరువుల్లోకి వదిలి పెట్టేలా మత్స్య శాఖ చర్యలు తీసుకుంది. తద్వార పారదర్శకంగా కేసీఆర్ సర్కారు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
కానిప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఊసే కరువైంది. త్వరగా చేప పిల్లలను ఉచితంగా చెరువుల్లో వదిలేందుకు చర్యలు ప్రారంభించాలంటూ గంగపుత్రులు కోరుతున్నారు. అయినప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. నాడు సంబురంగా సాగిన చేప పిల్లలను వదిలే ప్రక్రియ ఇప్పుడు గగనమైంది. చేప పిల్లలను అందించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గంగ పుత్రులు వినతులు సమర్పిస్తున్నారు. ప్రజావాణిలోనూ పలువురు కలెక్టర్లకు విన్నపాలు సమర్పించారు. అయినప్పటికీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. అధికారికంగా ప్రకటన రావడం లేదు.