శక్కర్‌నగర్, ఏప్రిల్ 19: అత్యధిక ఉష్టోగ్రత నమోదు కావడంతో డంపింగ్ యార్డులు మంటలో చెలరేగిన ఘటన బోధన్ పట్టణ శివారులో శనివారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ శివారులోని పాండుఫారంలో సుమారు 22 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డు ఉండగా.. పది ఎకరాల్లో చెత్తను వేస్తున్నారు. గరిష్ఠ ఉష్టోగ్రత నమోదు కావడంతో శనివారం చెత్తకు నిప్పంటుకున్నది. గమనించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ జేసీబీ, ట్రాక్టర్లను తెప్పించి, చెత్తను వేరు చేయించారు.
సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ అధికారి శ్రీనివాస్, తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని సుమారు పది గంటలపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో డంపింగ్ యార్డును సందర్శించి.. బల్దియా కమిషనర్ వెంకటనారాయణతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డంపింగ్ యార్డులోని ఓ పక్క చెత్తకు మాత్రమే నిప్పు అంటుకున్నది. అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. డంపింగ్ యార్డులు పలు విలువైన మిషన్లు ఉన్నాయి.