వినాయక్‌నగర్, మార్చి 9: నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న తిలక్‌గార్డెన్ పార్క్ లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గార్డెన్‌లోని ఎడమ వైపు భాగంలో ఎండుగడ్డితోపాటు చెట్లకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏం జరిగిందోనని పార్క్‌లో ఉన్న సందర్శకులు పరుగులు తీశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సాయంత్రం సమయంలో గార్డెన్‌కు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. గార్డెన్లో మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అసలు మంటలు ఎలా అంటుకున్నాయనే విషయం అంతుపట్టడంలేదని పార్క్ నిర్వాహకులు పేర్కొన్నారు. పార్క్‌కు వచ్చిన వారిలో ఎవరో పోకిరీలు ఉద్దేశపూర్వకంగానే అక్కడ నిప్పంటించి ఉంటారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.ఈ ప్రమాదంలో సందర్శకులకు ఎలాంటి హాని జరకగపోవడంతో పార్క్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.