వినాయక్ నగర్, మే; 25 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఓ టిఫిన్ సెంటర్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. టిఫిన్స్ తయారు చేసే క్రమంలో హోటల్లోని కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా ఈ పరిణామం చోటు చేసుకోవడంతో టిఫిన్ సెంటర్లో పనిచేసేవారు అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పేశారు.
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో కస్టమర్లు ఎవరు లేకపోవడంతో ఎలాంటి హాని జరగలేదు. వేడి నూనెలో నీళ్లు పడడం వల్ల మంటలు అంటుకొని ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. సకాలంలో ఫైర్స్ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో హోటల్లో ఆస్తి నష్టం సైతం ఎక్కువగా జరగలేదని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై నిర్వాకుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఫైర్ అధికారులు తెలిపారు.