ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 28: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు అధికంగా వరి పంటను సాగు చేస్తారు. వానకాలం పంటల సాగులో భాగంగా చాలా ప్రాంతాల్లో వరి పంటలు కలుపు దశకు వచ్చాయి. ఎరువుల వినియోగంపై రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో రసాయనాల కోసం అధికంగా ఖర్చుపెడుతున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించకుండా తోటి రైతులను చూసి తమ పొలంలోను అవసరం లేకున్నా అధిక మోతాదులో ఎరువులను వేస్తున్నారు. వరిసాగులో నీటి యాజమాన్యంతోపాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం కూడా కీలకమని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎరువుల యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయని చెబుతున్నారు. భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడినప్పుడే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. ఎకరానికి 25 -32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 -16 కిలోల పొటాష్ లభించే ఎరువులను మాత్రమే వినియోగించాలని, అంతకుమించి వాడితే పంటను తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మూడు విడతలుగా యూరియా..
వరిపైరు పెరిగేందుకు నత్రజని దోహదపడుతుంది. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో లేదా యూరియా రూపంలో వినియోగించవచ్చు. దీనిని మూడు దఫాలుగా పంటలో చల్లుకోవాలి. నాట్లు వేసే ముందు, దుబ్బు చేసే దశలో, అంకురం ఏర్పడే దశలో నత్రజనిని అందించే ఎరువులను వాడుకోవాలి. నత్రజని పోషకాన్ని సరైన మోతాదులో అందించేందుకు యూరియా వాడే విధానంపై రైతులు పట్టు పెంచుకోవాలి. ఎకరానికి 25 – 32 కిలోల నత్రజని అందించాలంటే 55 – 70 కిలోల యూరియాను మూడు సమభాగాలుగా విభజించి పొలంలో చల్లుకోవాలి. మొదటిభాగం చివరిదమ్ములో, 2వ భాగం పిలకకట్టేదశలో, చివరి భాగం అంకురం ఏర్పడే దశలో వేయాలి. భాస్వరం, పొటాష్‌ను చివరి దమ్ములో వేయాలి. పైరు పెరుగుదల ఆశించిన స్థాయిలో లేకపోతే అదనంగా 10 – 15 కిలోల యూరియా వాడొచ్చు. లేదంటే 50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండి లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. యూరియా చల్లిన 48గంటల తర్వాత పొలంలో తప్పనిసరిగా నీరు పెట్టాలి. యూరియా అధికంగా వినియోగిస్తే పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. యూరియా ఎక్కువైతే ఆకుల్లో పత్రహరితం పెరిగి ఫలితంగా పురుగులు దాడి చేస్తాయి. అగ్గితెగులు, ఆకుముడత తెగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
భాస్వరం సకాలంలో అందించాలి..
మొక్కల వేర్ల పెరుగుదలకు పోషక పదార్థంగా భాస్వరం ఉపయోగపడుతుంది. దీనిని నాటు వేసే ముందు దమ్ములో లేదా నాట్లు వేసిన 15 రోజులలోపు కాప్లెంక్స్ ఎరువుగా వాడాల్సి ఉంటుంది.
జింకు ధాతు లోపం..
సాధారణంగా జింకులోపం చలికాలంలో, చౌడు భూముల్లో, మురుగు సమస్య ఉన్న చేలలో కనిపిస్తుంది. వరి నాటిన 2,4 వారాలలో జింకు లోపం కనిపిస్తుంది. ముదురాకు చివర తుప్పు మచ్చలు ఏర్పడి, ఆకులు పెళుసుగా తయారవుతాయి. జింకు లోపం నివారణ కోసం ఎకరానికి 20 కిలోల జింకు సల్పేట్‌ను చివరి దమ్ములో వేయాలి. లేదా 0.2 శాతం జింకు సల్ఫేట్‌ను నాలుగైదు రోజుల కోసారి రెండు మూడు పర్యాయాలు ఆకులు తడిచేటట్లు పిచికారీ చేయాలి. అనంతరం ఎకరానికి 25-30 కిలోల యూరియాను పైపాటుగా వేయాలి. జింకు సల్ఫేట్‌ను పురుగు మందులతో కలిపి పిచికారీ చేయొద్దు.
ఐరన్ లోపం..
వరి పంటలకు ఐరల్ లోపం కూడా రావొచ్చు. ఇది మెట్ట నారుమడుల్లో కనిపిస్తుంది. ఆకు, ఈనెల మధ్య పత్రహరితం లోపించి తెల్లగా మారుతుంది. దీని నివారణకు 20-30గ్రాముల అన్నభేది చూర్ణం, లేదా మూడు గ్రాములు నిమ్మ ఉప్పు లీటరు నీటిలో కలిపి పైరు బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
పచ్చిరొట్టి వినియోగం..
చాలా జాగ్రత్తగా ఉండాలి..
రైతులు ప్రతిరోజూ పంట పరిస్థితిని గమనించాలి. ఏమాత్రం అనుమా నం వచ్చినా వెంటనే వ్యవసాయశా ఖ అధికారుల సూచన మేరకు రసాయనాలను వినియోగించాలి. పశువుల ఎరువులైతే ఎకరానికి నాలుగు టన్నులు వేయాలి. పంటలు సాగుచేసేముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. దీని ఆధారంగా అధికారులు సిఫారసు చేసిన ఎరువులను వేసుకోవాలి.
– గాటాడి సంతోష్‌కుమార్, మండల వ్యవసాయాధికారి, ఎల్లారెడ్డి