కంఠేశ్వర్, ఆగస్టు 11: స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశా రు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ నుంచి ధర్నాచౌక్ వరకు మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నాగేశ్వర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యా జమాన్యాలు ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని తెలిపారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టం పేరుతో విద్యార్థుల అకౌంట్లలోనే డబ్బులు జమ చేస్తున్నామని చెప్పి, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని ఇప్పటివరకు ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టంను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే బడ్జె ట్ సమావేశాల్లో మంత్రిని కేటాయించాలని లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు సంఘీభావం తెలిపారు. నాయకులు రాజు, చక్రి, రాజు, వినీత్, గోవింద్, విశాల్ పాల్గొన్నారు.