Kamareddy | కామారెడ్డి : అదృశ్యమైన ముగ్గురు కూతుళ్లను కన్నతండ్రి ఇస్మాయిల్ హత్య చేశాడని ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కు చెందిన సబీనా ఇస్మాయిల్ దంపతులకు ముగురు ఆడపిల్లలు సిపాత్ (8), అయాత్ (7), మరియం (5) శనివారం ఇంటి నుంచి ఆటో డ్రైవర్ అయినా తన తండ్రి తో కలిసి బయటకు వెళ్లారని తెలిపారు.
పిల్లలకు కిరాణా షాపులో తినుబండారాలు కొనిచ్చాడని, ఇంటికి వెళ్లమని చెప్పి ఆటోలో ముగ్గురు పిల్లలను ఎక్కించుకొని కామారెడ్డి పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడని వెల్లడించారు. తన ముగ్గురు పిల్లలను చెరువులో తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని, సాయంత్రం అయినా పిల్లలు రాకపోయేసరికి చిన్నారులు అదృష్టమయ్యారని కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దీంతో పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా సీసీ కెమెరాల ఆధారంగా కామారెడ్డి పెద్ద చెరువు వద్ద గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. రాత్రి 11 గంటల వరకు ఆయాత్, మరియం మృతదేహాలు లభ్యమైనాయని, అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టి సిపాత్ మృతదేహాన్ని వెలికి తీశారని తెలిపారు. చిన్నారుల మృతదేహాలను జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
తండ్రి ఇస్మాయిల్ పరారీలో ఉండగా ఆదివారం పోలీసులు ఇస్మాయిల్ పట్టుకొని విచారించామన్నారు. అప్పుల భారం, ఆర్థిక భారం వల్ల ముగ్గురు కూతుళ్లను పోషించకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు చెప్పారు. అలాగే ఈనెల 6న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంకి కాలనీకి చెందిన సింహాద్రి (10), కోదండం విజయ్ (9) శుక్రవారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ నరహరి, రూరల్ సీఐ రామన్ పాల్గొన్నారు.