లింగంపేట (తాడ్వాయి), అక్టోబర్13: అన్నదమ్ములైన ఆ చిన్నారులు కొత్త బట్టలు వేసుకొని దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఇంట్లో అందరితో సరదాగా గడుపుతుండగా.. అలా బయటికి వెళ్లొద్దామంటూ వారిని తండ్రి బైక్‌పై బయటికి తీసుకెళ్లాడు. ఇద్దరు చిన్నారులు నాన్న తమకు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అనుకొని ఆనందపడ్డారు.
తండ్రి ఆ బైక్‌ను గ్రామశివారులోని ఓ వ్యవసాయబావి వద్దకు తీసుకెళ్లాడు. తన ఇద్దరు కుమారులను బావిలోకి నెట్టేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమకు ఏదైనా చూపిస్తాడనో, కొనిస్తాడనో ఆశతో వెంట వచ్చిన ఆ చిన్నారులకు కన్నతండ్రే కాలయముడవుతాడని ఊహించలేదు. పండుగ పూట తమ నూరేళ్ల ఆయుష్షును తనతో తీసుకెళ్తాడనుకోలేదు. ఈ హృదయవిషాదకర ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది.
నందివాడ గ్రామానికి చెందిన చిట్టెపు గుండారెడ్డి, సుగుణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు అపర్ణకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం నాయ్‌గావ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డిని పదేండ్ల క్రితం ఇల్లరికం తెచ్చుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ పనులు చేసేవాడు. అపర్ణ- శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేశ్‌రెడ్డి (7), అనిరుధ్ రెడ్డి (5) ఉన్నారు. శనివారం దసరా సంబురాల్లో పాల్గొన్న శ్రీనివాస్‌రెడ్డి.. రాత్రి 8 గంటల ప్రాంతంలో తన కుమారులను తీసుకొని బయటికి వెళ్లాడు.
రాత్రి 10 దాటినా ఇంటికి రాకపోవడంతో భార్యతోపాటు కుటుంబీకులు వారి కోసం గాలించారు. ఆదివారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన సెల్‌ఫోన్, చెప్పులు గుర్తించారు. బావిలో చూడగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించగా.. శ్రీనివాస్‌రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు.
అనంతరం బావిలోని నీటిని మోటర్ సాయంతో తోడించగా శ్రీనివాస్‌రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపంతో పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఘటనా స్థలానికి వెళ్లి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు.