నవీపేట,ఏప్రిల్ 27: కూతురు పెండ్లి ఖర్చుల కోసం మేకల విక్రయాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురు పెండ్లి రోజే బలవన్మరణానికి పాల్పడగా, ఈ ఘటన నవీపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అయిన ఎల్కా దేవన్న(51)కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. తనకు 130 మేకలు, గొర్రెలు ఉన్నాయి. కూతురు ప్రవళిక పెండ్లి ఖర్చుల కోసం 30 మేకలను విక్రయించాడు.
ఈ నెల 26న నస్రూల్లాబాద్ మండ లం అంకోల్ గ్రామంలో ఘ నంగా పెండ్లి చేసి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంటి వద్ద 130 మేకల మందలో నుంచి 30 మేకలు తగ్గి పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మద్యం తాగి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెండ్లి చేసుకొని కూతురు ఇంటికి వచ్చే సరికే తండ్రి విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు అందోళనకు గురయ్యారు. కూతురు పెండ్లి రోజే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు.