నాగిరెడ్డిపేట, జూన్12: భార్యపై కోపంతో కన్నకొడుకును దారుణంగా హతమార్చాడో తండ్రి. ఈ ఘటన మండలంలోని పోచారం గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన బోయిని శ్రీహరి కూతురు అక్షితకు ఐదేండ్ల క్రితం లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన నర్వ అనిల్‌తో వివాహమైంది. వీరికి శేషాంత్ (4)తోపాటు ఆరు నెలల పాప ఉన్నది. అనిల్ భార్యాపిల్లలతో కలిసి మంగళవారం మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్ మండలం శాలిపేట గ్రామంలో తన సోదరి ఇంట్లో జరుపుకున్న బోనాల పండుగకు వెళ్లారు.
అక్కడ అనిల్ రెండో చెల్లి కూతురు ఆడుకుంటుండగా.. శేషాంత్ వల్లే దెబ్బతగిలిందని గొడవపడ్డారు. బుధవారం పొల్కంపేట చేరుకున్న తర్వాత భార్యాభర్తలు గొడవపడగా.. భార్యపై అనిల్ చేయిచేసుకున్నాడు. దీంతో అనిల్ భార్యా పిల్లలను తీసుకొని పోచారం గ్రామంలోని అత్తారింటికి వచ్చాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కొడుకు శేషాంత్ను ద్విచక్రవాహనంపై బయట తిప్పుతానని చెప్పి తీసుకెళ్లి ముక్కు మూసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.
అనంతరం బాబును బైక్‌పై పడుకోబెట్టుకొని తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. తల్లి అక్షిత, కుటుంబసభ్యులు బాబును చేతుల్లోకి తీసుకొని చూడగా..అచేతన స్థితిలో ఉండడంతో వెంటనే గోపాల్‌పేటలోని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు చెప్పారు. అక్కడికి చేరుకున్న అనిల్ తానే ముక్కు మూసి చంపేసినట్లు చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లి అక్షిత, కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహంతో పోలీస్‌స్టేషన్ చేరుకొని అనిల్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై చెప్పారు.