వానకాలం సాగుపై అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సీజన్ ప్రారంభమై తొలకరి పలుకరించినా..ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జిల్లాలో ఇంకా సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడం, వరప్రదాయినిగా పేరొందిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రైతన్నకు సాగు కష్టాలు తప్పడం లేదు. నీరులేక రైతులు నారుమడులను సంరక్షించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
-బాన్సువాడ, జూన్ 21
వానకాలం ప్రారంభమై సుమా రు 20 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదుకాలేదు. నిత్యం ఉరుములు, మెరుపులు, గాలిదుమారం రేగడంతో వర్షం కురుస్తుందేమోనని రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. సాగునీటి సౌలభ్యం ఉన్న బోరుబావుల వద్ద కొందరు రైతులు ముందస్తుగానే నారుమడులు వేసుకున్నారు. వ్యవసాయశాఖ సూచనల మేరకు మిర్గంవరకు నారుమడులు వేసి, వర్షాలు కురిస్తే నాట్లు వేయడానికి రైతులు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్నారు.
కానీ వరుణుడు ముఖం చాటేయడంతో వాగు లు, వంకల్లో నీరులేక నారుమడులు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వానకాలం పంటలసాగుపై వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసి, రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది.కానీ సాగునీటి వసతులు లేకపోవడంతో రైతులకు తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ వానకాలంలో రైతుల సాగు, అంచనా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో వానకాలంలో 3,13, 965 ఎకరాల్లో వరిసాగు అంచనా వేసింది. కానీ బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఇప్పటి వరకు సుమారు 85 వేల ఎకరాల్లో మాత్రమే రైతులు నారుమడులు వేసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 3200 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు రైతులు సుమారు 20 వేల ఎకరాల్లో పచ్చరొట్ట విత్తనాలు వేసుకున్నట్లు సమాచారం. జిల్లాలో సుమారు లక్షా 80 వేల ఎకరాల్లో ఆరు తడి పంటల (మక్కజొన్న, జొన్న, సోయాబీన్, పత్తి, పెసర, మినుము, తొగరు, చెరుకు, వేరుశనగ తదితర)సాగుకు అధికారులు అంచనాలు రూపొందించారు. కానీ వర్షాలు కురవకపోవడం, నిజాంసాగర్ నీటి విడుదల చేయకపోవడంతో మక్కజొన్న 3500, సోయాబీన్1300, చెరుకు 30, తొగర్లు 200 ఎకరాల్లో సాగుచేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే వేసిన పంటలు మొలకెత్తకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేసింది. ఈ సంవత్సరం ప్రాజెక్టులో సాగు కోసం నీళ్లు ఉన్నా విడుదల చేయడంలో ప్రస్తుతం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటివిడుదలపైనే గంపెడాశలు పెట్టుకున్నారు.
గత వానాకాలంతో పోల్చిచూస్తే జూన్ మాసంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైంది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో సాగు కష్టాలు దూరమయ్యాయి. ఈ ఏడాది జూన్ మాసంలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడం గమనార్హం.ఒకవైపు జిల్లాలో వర్షాలులేక, మరోవైపు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేపట్టకపోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నా రు. వర్షాలు కురిసే వరకు నిజాంసాగర్ నుంచి నీటిని అందిస్తే వరినాట్లు, నారుమడులు వేసుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు. కామారెడ్డి జిల్లా లో జూన్ 1 నుంచి 20 వరకు 91.9 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం71.4 మి.మీ శాతం మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు.-.22.2 లోటు వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.