కాంగ్రెస్ హయాంలో అరాచకం రాజ్యమేలింది. భూ రికార్డుల నిర్వహణలో దళారులదే పెత్తనం కొనసాగింది. అక్రమ పద్ధతిలో వేలాది ఎకరాల భూములను అప్పనంగా కట్టబెట్టారు. అసలైన అర్హుల నోట్లో మట్టికొట్టారు. కానీ, స్వరాష్ట్రంలో ‘ధరణి’ ద్వారా సీఎం కేసీఆర్ దళారులకు చెక్ పెట్టారు. రైతులకు చట్టబద్ధంగా హక్కులు కల్పించారు. డిజిటల్ రూపంలో భూ రికార్డులకు పటిష్ట భద్రత కల్పించారు. పూర్తి పారదర్శకంగా, వేగవంతంగా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నాయి. ధరణి రాక మునుపు, వచ్చాక ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటున్న రైతులు.. జెట్ స్పీడ్ సేవలు చూసి సంబురపడుతున్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో దగాపడ్డ అన్నదాతలు.. నేటి సంక్షేమ పాలనను చూసి మురిసి పోతున్నారు.
– నిజామాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధరణిలో రైతుల మెప్పుపొందుతున్న సేవలు అనేకం ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎదురు చూపులు, తమ రిజిస్ట్రేషన్ సమయం కోసం పడిగాపులు గంటలకొద్దీ ఉండేది. దళారి ఎలా చెబితే అలా నడుచుకునేది. పట్టాదారు మాటకు విలువే లేకపోయేది. సబ్ రిజిస్ట్రార్లు కేవలం దళారుల మాటలు మాత్రమే వినేది. వారికి మాత్రమే కుర్చీ వేసి పక్కన కూర్చోబెట్టుకునేది. అలాంటి అరాచకమైన సేవలకు ధరణితో ఫుల్స్టాప్ పడింది. ఇప్పుడు కోరుకున్న సమయానికి స్థానికంగా మండల కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవ్వడంతో సామాన్యులు కేసీఆర్ తీసుకు వచ్చిన ఈ అత్యుత్తమ విధానాన్ని కీర్తిస్తున్నారు. అంతేకాకుండా ఈ విధానంలో కొత్త పట్టాదారు పాసు పుస్తకం కోసం ఎవరికీ డబ్బులు చెల్లించే అవసరమే లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారి చిరునామాకే పోస్టాఫీస్ ద్వారా పాస్‌బుక్ పంపుతుండడం ఇందులో మరో విశిష్టత. ఇందుకు కేవలం పోస్టల్ చార్జీలను మాత్రమే ప్రభుత్వం వసూలు చేస్తున్నది.
భూ తగాదాలకు విరుగుడు…
కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ, ప్రభుత్వ, అసైన్డ్ భూముల విషయంలో నిబంధనలను తుంగలో తొక్కి సబ్ రిజిస్ట్రార్లు ఇష్టానుసారంగా అక్రమార్కులకు రిజిస్ట్రేషన్లు చేశారు. వందలాది ఎకరాల భూమి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దొంగ రిజిస్ట్రేషన్ కాగితాలతో ఎంతో మంది అనర్హులకు హక్కు పత్రాలు జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్లు చేసిన తప్పిదాలతో భూముల పేరిట ఘర్షణలు కోకొల్లలుగా చెలరేగాయి. సామాన్యులు అనేక మంది రోడ్డున పడి కోర్టు చుట్టూ తమ భూమి కోసం పోరాటం చేస్తున్న దాఖలాలు అనేకం. ధరణి పోర్టల్‌తో ఇకపై ఇలాంటి అక్రమాలకు అవకాశమే లేదు. భూ తగాదాలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం సమస్త విషయాలను క్రోడీకరిస్తూ ధరణి వెబ్‌సైట్‌ను తీసుకు వచ్చింది. ఇది బ్యాంకింగ్ తరహాలో నిర్వహించే వెబ్‌సైట్‌గా అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఐటీ రంగ నిపుణుల పర్యవేక్షణలో ఈ వెబ్సైట్ పనిచేస్తున్నది. గ్రామ స్థాయిలో చిన్న చిన్న పనులు, పేర్ల మార్పులు వంటివి చేసినా రాష్ట్ర స్థాయి అధికారుల వరకు క్షణాల్లో తెలిసి పోతుంది. ప్రతీ విషయంలో పారదర్శకత, జవాబుదారీ ఉండేలా నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా భూతగాదాల నివారణే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించింది.
మ్యుటేషన్ చిక్కులకు చెక్…
భూముల రిజిస్ట్రేషన్ సమయంలో రైతులకు, ప్రజలకు అవినీతి వేధింపులు తగ్గించేందుకు పూర్తి స్థాయి పారదర్శకతతో కూడుకున్న వ్యవస్థను సీఎం కేసీఆర్ రూపొందించారు. ఇందులో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. పాత చట్టం స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం, మున్సిపల్ సవరణ చట్టాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ధరణి వెబ్సైట్ ప్రజా బాహుళ్యంలోకి రావడంతో రెవెన్యూ శాఖలో అవినీతి అంతమై ప్రజలందరికీ భారీ ఊరట దక్కుతున్నది. ముఖ్యంగా మ్యుటేషన్ పరిశీలనలో తీవ్రమైన జాప్యంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగేది. రిజిస్ట్రేషన్ శాఖలో స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలోనే మ్యుటేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. అక్కడే చేయకుండా ఈ తంతును ఇన్నాళ్లు మున్సిపాలిటీలపై వదిలేశారు. దీంతో చెల్లించిన ఫీజు వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చేంత వరకు ఇక్కడ వేచి చూడాల్సి వచ్చేది. నూతన చట్ట సవరణలో మ్యుటేషన్, ఆస్తి పన్ను మదింపు ప్రక్రియ అధికారాలను మున్సిపల్ కమిషనర్ల నుంచి తొలగిస్తూ ఆ అధికారాన్ని సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆస్తి పన్ను రికార్డులో కొన్నవారి పేరు నమోదు అవుతుంది. దీంతో ఆస్తులు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అమ్మకం, దానం, తనాఖా, విభజన, వారసత్వ విధానంతో బదిలీలన్నీ ఆన్లైన్లో ఏక కాలంలో రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ అయిపోతుంది. అక్కడే మ్యుటేషన్ సర్టిఫికేట్ సైతం జారీ అవుతుండడం విశేషం.
రైతులకు రంది లేకుండా పోయింది
ధర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి కష్టం కావద్దని ఆలోచించి ధరణితో అంతా కంప్యూటర్‌మయం చేసిండ్రు. ఒళ్లంటే ఆళ్లు రికార్డులు గోల్మాల్ చేయకుండా మంచిగ చేసిండ్రు. దానికితోడు భూములు అమ్మినా కొన్న ఈడనే రిజిస్ట్రేషన్లు చేసుడుతోటి మంచి సౌలత్ అయ్యింది. రైతులకు వరంలెక్క మారిన గిసుంటి పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అస్తే తీసేస్తా అనుడు ఏందో? ధరణితోని అన్ని పరేషాన్లు పోయినయ్. భూమి రికార్డుల కోసం వీఆర్వో, తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు తప్పినయ్. మొబైల్ ధరణి పోర్టల్ ఆప్ ద్వారా మన భూమి వివరాలన మనమే చూసుకోవచ్చంటే అర్థం చేసుకోవచ్చు పాలన రైతుల చేతుల్లోకి వచ్చిందని. రైతుల కోసం పాటు పడుతున్న ఈ సీఎం కేసీఆర్ సార్‌కు రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారు.
-పీసు రాజారాం, రైతు, ధర్పల్లి
కాంగ్రెసోల్ల మాటలు విచిత్రంగా ఉన్నాయ్..
రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ రైతులకు అండగా నిలుస్తున్నది. దీంట్లో భాగంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇంత మంచి పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసేస్తాం అనడం విచిత్రంగా ఉంది. గతంలో జిల్లా కేంద్రానికి వెళ్లి ఎన్నో బాధలు, ఖర్చులకు ఓర్చుకొని భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చేవాళ్లం. వచ్చినంక ఇక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చి నెలలు, ఏండ్లు గడుస్తున్నా మన పేరు మీద భూమి బదాయింపు కాకపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మండల కేంద్రంలోనే రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ అయిన పక్షం రోజులకు రికార్డుల్లోకి ఎక్కించి పట్టా పాసుపుస్తకం చేతికి ఇస్తున్నారు.
-గోపాల్‌రాజ్, యువరైతు, ధర్పల్లి.
ముసలోల్లకు ఇబ్బంది లేకుండావోయింది..
భూముల రిజిస్ట్రేషన్ కోసం మంచి సౌలత్ జేసిండ్రు. మాకు తెలిసినప్పటి సంది భూమి కోసం కర్ణం సార్, ఆర్ఐ సార్, తాసీల్ ఆఫీస్ సుట్టూ తిరిగెటోళ్లం. ఇప్పుడు అసుంటి తక్లీఫ్లు ఏవీ లేకుండావోయినయ్. అన్ని కంప్యూటర్లనే అయినయ్…ఏదైన పని వడితే మీ సేవలకు వోయి అక్కడ ఐప్లె చేసుకుంటే తాసీల్ ఆఫీస్‌ల కూడా జల్ది పనులు చేస్తుండ్రు గిట్లనే ఉండాలే. గింత మంచిగ చేస్తున్న కేసీఆర్‌కు ఎంతో పుణ్యం అస్తది. గీ సౌలత్‌లను చూస్తే సాన సంతోషమనిపిస్తుంది. కేసీఆర్ సార్ చాలా మంచి పనులు చేస్తుండు రైతులకు ఏ రంది లేకుండా చేస్తుండు.
-కునారపు రాజన్న, రైతు ధర్పల్లి
మండలంలోనే అన్ని పనులు పూర్తి
ధరణి పోర్టల్‌తో సేవలన్నీ చేరువయ్యాయి. ముఖ్యంగా మహిళలకు ఎంతో సౌకర్యవంతంగామారింది. భూముల వ్యవహారం అంటేనే మగవారు చూసుకోవాల్సిన వ్యవహారం అన్న చందంగా ఉండేది. కానీ ధరణీతో ఆ బాధ లేదు. మోబైల్ ధరణి ఆప్ ద్వారా భూముల రికార్డులను ఇంట్లో ఉండే చూసుకోగలుతున్నాం. ఒకప్పుడు పహానీ నకల్ కావాలంటే ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుండే.. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. భూములు అమ్మినా.. కొన్నా ఇంతకు ముందు నిజామాబాద్‌కు పోయి అక్కడ రోజుల తరబడి వేచి ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు మండలంలోనే అన్ని పనులు అయిపోతున్నాయి. మహిళా రైతులకైతే ధరణి పోర్టల్‌తో చాలా ఇబ్బందులు దూరమయ్యాయి.
-మిట్టపల్లి జ్యోతి, మహిళా రైతు, మైలారం గ్రామం