లింగంపేట(తాడ్వాయి), ఫిబ్రవరి18: మక్కల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు బుధవారం రోడ్డెక్కారు. వానకాలంలో విక్రయించిన మక్కల డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రధాన రహదారిపై బైఠాయించారు. మక్కల డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం సతాయిస్తున్నదని, మూడు నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చితికి పోతున్నామని అన్నదాతలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిపోయిన మక్కలను కొనేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఒక్క తాడ్వాయి మండలంలోనే సుమారు 50 వేల క్వింటాళ్ల మక్కలు ఉన్నాయని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారన్న ఆశతో గత 15 రోజులుగా కొనుగోలు కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. అయి తే, కేంద్రాలు ప్రారంభించక పోవడంతో పడిగాపులు తప్పడం లేదన్నారు. రైతుభరోసా డబ్బులు సైతం సకాలంలో ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకూ రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి, ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, మక్క రైతులు పాల్గొన్నారు.