నిజామాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కల్లాల్లో ధాన్యం బస్తాలు కుప్పలు తెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. కొనుగోళ్లు వేగంగా జరగకపోవడంతో ఎటు చూసినా రోడ్లపై ధాన్యం సంచులే కనిపిస్తున్నాయి. వెరసి ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదు. అడుగడుగునా హమాలీల కొరత వేధిస్తోంది. కొనుగోళ్లు జరిపిన తర్వాత వాహనాలు అందుబాటులో లేకపోవడంతో కల్లాల్లో కన్నీళ్లు తప్పా రైతులకు సంతోషం దక్కడం లేదు.
సమన్వయ లేమి, పాలకుల నిర్లక్ష్యం వల్ల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అభాసుపాలవుతోంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సన్నాహక సమావేశాలు తప్పా ఇన్ఛార్జీ మంత్రి సీతక్క నేతృత్వంలో జరిగిన సమావేశాలే లేవు. ప్రభుత్వ సలహాదారులు ముగ్గురు ఉన్నప్పటికీ ఎవ్వరికీ రైతుల బాధలు పట్టడం లేదు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలు చూసే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ సలహాదారు షబ్బీర్ అలీలు కనీసం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఫలితంగా రైతుల ఆక్రంధనలు వెలుగు చూస్తున్నాయి. దొడ్డు ధాన్యం సేకరణ విషయంలో సందిగ్ధత ఏర్పడింది. రైస్ మిల్లర్లు దించుకునేందుకు ససేమిరా అంటుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. లోడింగ్, అన్లోడింగ్ విషయంలో లారీల డ్రైవర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. వాహనాల కాంట్రాక్టర్ల ఆదేశాలతో ధాన్యం బస్తాకు రూ.5 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అదనంగా డబ్బులిస్తామంటే కల్లాలకు లారీలు వస్తున్నాయని లేదంటే మొఖం చాటేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్ల తీరు ఇదీ..
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 739 కేంద్రాలను ఏర్పా టు చేయగా ఇప్పటి వరకు 629 కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోం ది. 33 మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 10న ధాన్యం కొనుగోళ్లు షురూ అయ్యాయి. 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని యంత్రాంగం భావించింది. ఇప్పుడు 45 రోజుల్లోనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించారు. మే 10వ తారీఖు నాటికి 5 లక్షల 10వేల మెట్రిక్ టన్నులు ధా న్యం కొనుగోళ్లు జరిగాయి. ప్రైవేటు వర్తకు లు ఇప్పటికే 2లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. కొనుగోలు కేంద్రాలకు 7లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 1.75లక్షల మెట్రిక్ టన్ను లు సేకరించాల్సి ఉంది.
ఇప్పటి వరకు 71శాతం మేర కొనుగోళ్లు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. రోజుకు 700 నుంచి 800 వాహనాల్లో ధాన్యం లోడింగ్ అవుతుండగా 500 వాహనాలు మాత్రమే అన్లోడింగ్ అవుతున్నాయి. దొడ్డు రకం ధాన్యాన్ని కేవలం బాయిల్డ్ మిల్లర్లకు మాత్రమే కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.1075కోట్లు విలువ చేసే ధాన్యానికి చెల్లింపులు పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం లక్ష్యంలో దాదాపుగా 60శాతం అంటే 2లక్షల 17వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు. సన్నాల కంటే ఎక్కువగా దొడ్డు రకాలే ఎక్కువగా ఉంది. రోజుకు 10వేల మెట్రిక్ టన్నులు చొప్పున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. రూ.369కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా యాసంగి ధాన్యానికి ఇప్పటి వరకు పైసా బోనస్ చెల్లించలేదు. సన్న వడ్లు పండించిన ఏ ఒక్క రైతుకు క్వింటాకు రూ.500 జమ కావడం లేదు.