కోటగిరి/ భీమ్గల్, ఏప్రిల్ 8: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం తూకంలో తరుగు తీయంపై రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. కోటగిరిలో తహసీల్ ఆఫీస్ ఎదుట బైఠాయించ గా.. భీమ్గల్ మండలం గోన్గొప్పులలో ఆందోళన నిర్వహించారు. కోటగిరిలోని కొనుగోలు కేంద్రంలో తమకు ఎలాంటి సమాచారం లేకుండానే 40 కిలోల బస్తాకు 41 కిలోల 500 గ్రాముల నుంచి 650 గ్రాముల వరకు అదనంగా కాంటా వేస్తూ, క్వింటాలుకు రెండు కిలోలకు పైగా తరుగు తీస్తున్నారని మండిపడ్డారు.
రైతుల శ్రమను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తంచేస్తూ తహసీల్ ఆఫీస్ ఎదుట ఏముల నవీన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తహసీల్దార్ సమక్షంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్ ఆఫీస్లో వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రై తులు పాకల సాయిలు, కర్నె గజేందర్, వెల్లుట్ల గజేందర్, మామిడి శ్రీనివాస్, సాయిప్రసాద్, ఎడ్డెడి పోశెట్టి, కాశీరామ్, శ్యామ్సుందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కడ్తా పేరిట దోచుకుంటున్నారు..
కడ్తా పేరుతో దోచుకుంటున్నారని ఆరోపిస్తూ భీమ్గల్ మండలంలోని గోన్గొప్పుల లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. కడ్తా పేరుతో బస్తాకు 41.800 కిలో ల చొప్పున కాంటా చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వాస్తవానికి బస్తాకు 41.500 కిలోల వడ్లు మాత్రమే కాంటా వేయాలని, కానీ 300 గ్రాముల వడ్లను ప్రతి బస్తాకు అదనంగా తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దీంతో రైతు ప్రతి క్వింటాలుకు 600 గ్రాముల ధాన్యాన్ని అదనంగా నష్టపోతున్నాడని పేర్కొన్నారు. కేంద్రం నిర్వాహకుల తీరుతో తాము నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ షబ్బీర్, ఎస్సై మహేశ్ కొనుగోలు కేంద్రానికి చేరుకొని, రైతులను సముదాయించి, ఆందోళన విరమింపజేశారు. ఇకపై రైతులు కోరిన విధంగా బస్తాకు 41,500 కిలోలు వచ్చేలా కాంటా వేయిస్తామని భరోసా ఇచ్చారు.
రెండున్నర కిలోల తరుగు తీస్తున్నరు..
వానకాలంలో 40 బస్తాలకు 41కిలోలు తరుగు తీశారు. ఇందులో 650 గ్రాములు సంచి తూకం కింద తీసేసినా ఇబ్బంది లేకుండే. కానీ ఇప్పుడు దారుణంగా కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకు తరుగు తీస్తున్నరు. క్వింటాలు చొప్పున లెక్కిస్తే రైతులకు నష్టం వాటిల్లుతుంది.
– గజేందర్, రైతు, కోటగిరి
భారీగా నష్ట పోతున్నాం..
వానకాలంలో కిలోనే తరుగు తీశా రు. ఇప్పుడు పెద్ద మొత్తంలో తరుగు తీయడం మంచిది కాదు. రెండు కిలోల దాకా బస్తాకు తీస్తే, రైతుకు ఏం లాభం జరుగుతుంది. ప్రభుత్వం తరుగు దోపిడీని నివారించాలి.
– సాయిలు, రైతు, కోటగిరి