ఏర్గట్ల, డిసెంబర్ 22: రైతులు అయిల్‌పామ్ పంటల సాగుపై దృష్టి సారించాలని భీంగల్ ఏడీఏ కాంపాటి మల్లయ్య అన్నారు. మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీలో స్థానిక రైతులకు ఆయన గురువారం ఆయిల్‌పామ్ పంట సాగుపై అవగాహన కల్పించారు. ఎకరానికి 50 ఆయిల్‌పామ్ మొక్కలు నాటవచ్చని అన్నారు. ఈ మొక్కలను నాటేందుకు ఉపాధిహామీ కూలీలతో ప్రభుత్వం గుంతలు తవ్విస్తుందని తెలిపారు. ఎకరం భూమిలో 50 మొక్కలు నాటేందుకు రైతులు రూ.1000 డీడీని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పేరిట తీయాలని సూచించారు.
ఆయిల్‌పామ్ పంటలో అంతర్‌పంట సాగు చేసేందుకు రైతు బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.4200 జమచేస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీపై డ్రిప్ సౌకర్యం, ఐదెకరాల లోపు ఉన్న బీసీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మహ్మద్ అబ్దుల్ మాలిక్, సర్పంచ్ కట్కం పద్మాసాగర్రెడ్డి, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు బాంపల్లి గంగాధర్ పాల్గొన్నారు.
ఊట్పల్లి గ్రామంలో..
బోధన్ రూరల్, డిసెంబర్ 22: రైతులు వరికి బదులు అధిక ఆదాయం వచ్చే ఆయిల్‌పామ్ పంటను సాగు చేయాలని బోధన్ మండల వ్యవసాయ అధికారి సంతోష్ నాయక్ అన్నారు. ఊట్పల్లి గ్రామంలో ఆయిల్‌పామ్ తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవో గంగాజల, రైతులు పాల్గొన్నారు.