రుణమాఫీ ప్రక్రియ సంపూర్ణం కావడంతో ప్రయోజనం చేకూరని రైతన్నలంతా రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతన్నలంతా కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధర్పల్లిలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇదిలా ఉండగా బాల్కొండ నియోజకవర్గంలోనూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో భారీగా రైతు ధర్నా జరిగింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతన్నలందరికీ రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. నవీపేట మండలం జన్నేపల్లిలోనూ సిండికేట్ బ్యాంకు వద్ద రైతులు నిరసన ప్రదర్శన చేశారు.
రుణమాఫీ గందరగోళంలో రైతులకు సావధానంగా సమాధానం చెప్పాల్సిన వ్యవసాయ శాఖ నిజామాబాద్ జిల్లాలో మొద్దు నిద్రను ప్రదర్శిస్తున్నది. ప్రభు త్వ పెద్దలతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం వ్యవసాయ శాఖకు మార్గనిర్దేశనం చేశారు. రుణమాఫీ రాని రైతులకు అండగా నిలవాలని వారి అనుమానాలు నివృత్తి చేయాలంటూ సుదర్శన్ రెడ్డి, భూ పతి రెడ్డిలతోపాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమం తు సైతం ఆదేశాలు ఇచ్చారు. కానీ నిజామాబాద్ వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ పత్తా లేకుండా పోయారంటూ రైతులు వాపోతున్నారు.
మండల స్థాయిలో వ్యవసాయాధికారులు ఫోన్లు ఎత్తడం లేదని, కనీసం సమాధానం ఇవ్వడానికి ఇష్టపడడం లేదంటూ వాపోతున్నారు. కలెక్టర్ చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పూర్తిగా భిన్నమైన దుస్థితి కనిపిస్తున్నదంటూ రైతులు వాపోతున్నారు. రుణమాఫీ కోసం గట్టిగా నిలదీస్తే వ్యవసాయాధికారులు చేతులెత్తేస్తున్నారని రైతులు చెబుతున్నారు. బ్యాంకర్లను అడగాలంటూ తప్పించుకొని తిరుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఇంతటి ఘోరమైన దుస్థితిని చూడలేదని తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ వర్తించని రైతుల సంఖ్య అక్షరాల 2లక్షల 4వేల మంది వరకు ఉంటారని అంచనాలు వినిపిస్తున్నాయి. 2016లో కేసీఆర్ హయాంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3లక్షల 79వేల 520 మంది రైతులకు రూ.1571. 25 కోట్లు మేర రుణాలను రద్దు చేశారు. రెండోసారి కేసీఆర్ సర్కారు ఏర్పడిన తర్వాత ఇదే స్థాయిలో పెద్ద ఎత్తున రైతులకు రూ.లక్షలోపు రుణాలను రద్దు చేశారు.
రూ.2లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారులో అరకొరగానే వర్తించింది. మొత్తం అర్హులైన రైతుల సంఖ్య 3లక్షల 79వేల 520 మంది కన్నా ఎక్కువగా ఉంటే కేవలం లక్షా 75వేల 701 మందికి మాత్రమే మాఫీ వర్తించినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ మొత్తం కేవలం రూ.1281కోట్లు మాత్రమే. రూ.లక్షలోపు రుణాలను కేసీఆర్ హయాంలో 2016లో రూ.1571కోట్లు వెచ్చించాల్సి రావడం విశేషం.
మోర్తాడ్, ఆగస్టు 17: ప్రతి రైతుకూ రూ.2లక్షల రుణమాఫీ చేయాలి. నాకు మూడు దఫాల్లో రుణమాఫీ రాలేదు. నా పేరు మీద రూ.2.21లక్షలు, నా భార్య పేరు మీద లక్ష బ్యాంకుల్లో రుణం ఉంది. మా ఇద్దరిలో ఎవరికీ రుణమాఫీ రాలేదు. మూడు విడుతల్లో ఇచ్చిన రుణమాఫీ లిస్టులో మా పేరు లేదు. ఎందుకు రాలేదన్న విషయంలో ఇప్పటి వరకు మాకు కచ్చితమైన సమాధానం లభించలేదు.
– సత్యంరెడ్డి, రైతు, చౌట్పల్లి
నాకు బ్యాంకులో రూ.3లక్షల రుణం ఉన్నది. రెండు లక్షల రుణమాఫీ వస్తదని అనుకున్న కానీ లిస్టులో పేరు రాలేదంటుండ్రు. బ్యాంకులకు వెళ్తే లిస్టులో పేరు ఉంటేనే రావాలని, మమ్మల్ని ఎందుకు సతాయిస్తారని అంటున్నరు. బ్యాంకులో రూ.3లక్షల రుణం ఉన్నందున రూ.2లక్షల రుణం వస్తుందనుకున్న కానీ అదికూడా రాలే. వస్తదో రాదోనని అనుమానంగా ఉన్నది.
– బబ్బురు నర్సయ్య, రైతు, శెట్పల్లి
నాకు బ్యాంకులో రూ.2లక్షల రుణం ఉన్నది. ఈసారి మాఫీ వస్తదనుకున్నా కానీ రాలేదు. లిస్టులో పేరు లేదని చెప్తుండ్రు. మొదటి, రెండు విడుతల్లో రూ.లక్షా50వేల లోపు వారికి ఇస్తున్నారని చెప్పడంతో మూడోసారి నాకు తప్పకుండా మాఫీ వస్తుందనుకున్న. గతంలో లేని ఆంక్షలు పెట్టడం.. రైతులకు శాపంగా మారింది.
– నడ్పోల్ల హన్మంత్రెడ్డి, రైతు, దోంచంద
నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది. వ్యవసాయమే చేసుకుంటూ బతుకుతాం. రూ.1.05లక్షల రుణాన్ని ఎడపల్లి సిండికేట్ బ్యాంకులో తీసుకున్నాను. కాంగ్రెస్ ప్రభు త్వం మాఫీ చేసిన రుణాల జాబితాలో నా పేరు లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– మెగావత్ సంతోష్, ఒడ్డపల్లి, ఎడపల్లి మండలం